నీకు తెలీకుండా నీలో
________________

నీకే కాదు
మీఅమ్మక్కూడా తెలీకుండా
నీతోపాటే నేనూవచ్చేసా
ఈభూమ్మీదికి

నీవయసు వేగంకన్నా
నాదురుసుతనపు వేగమే ఎక్కువ
అందుకే
ఎప్పుడూ
నీకన్నా నేనే ముందు

నీలో కలిసిపోయి
పప్పులో ఉప్పులా
ఉండాల్సినంత కాక, ఎక్కువయినప్పుడల్లా
నువు భంగపడుతున్నా
నీకంటికి చిక్కలేదు చూసావా?

నీలో నేనున్నానని తెలీని
నీపతనాలకన్నిటికీ
కారణం నేనేనని తెలీని
నీ అమాయకత్వానికి జాలేసి
నన్నొదిలేసుకుంటావని
నీకెన్నో అవకాశాలిచ్చా

అప్పుడు తెలిసింది..
ఎన్నవమానాలైనా భరిస్తావు గానీ
నన్నొదులుకోలేవని
అప్పట్నించే నీపై ఏవగింపు
అయినా నిన్నొదిలి పోలేను
అప్పటికే నా అంతట నేను వెళ్ళలేనంతగా
నన్ను నీలో బంధించేసుకున్నావు

నువు కాశీ ప్రయాణమయినపుడనుకున్నా
కచ్చితంగా నన్నక్కడొదిలేస్తావని
ఊహూ..తెలివిగా
నీకు నచ్చని కాకరకాయా
ఎప్పుడూ తినని వెలగపండూ
వదిలేసావ్

పోన్లే ఈనాటికైనా దొరికింది నాకు విముక్తి
ఇక నీదారి నీదీ నాదారి నాదీ
అదుగో నీకు సాయం వస్తున్నారు యమభటులు
వెళ్ళు
నాపేరు 'అహం' అని తెలీని ఇంకో మనిషిని
నేనూ చూసుకోవాలిగా !!
 

దినదినగండం
___________

మరీ మరీ సెప్పెల్లింది
ఎనకాల సెక్కతలుపు సారేసి
గొల్లెం సరీగా ఎట్టమని
గొల్లెం ఎడితే మాత్రం ఏటి
సెక్కే ఇరిగిపోయున్నాది
అదో లెక్కేటి ఆ ఎదవ కుక్కకి?
నాన్నకని దాసింది ఎండుసేప్ముక్క
మద్దేనం ఎంతాకలేసిందో
మూత్తీసి ఓపాలి వాసన సూసాను గానీ
తినీసినా బాగున్ను!

రాత్రి గెంజికాయడానికి
పుల్లల్తెచ్చెట్టమంది
ఈ ఎదవ ఒక నిమసమేనా వదిల్తేనా?
సంకదించితే సాలు
ఊరంతా ఇనపడేలా గోల గోల
నాన్నకి టీజేసిచ్చినాక మిగిల్న
అరగ్లాసు పాలు ఎప్పుడో పొద్దున్నే
అవజేసీసేడు
మద్దేనం నీల్లల్లో మైదాపిండి కలిపి
సీసా నోట్లో ఎడితే
నాయేపదోలా సూసాడు గానీ
అన్నీ తాగీసేడు

సీకటడిపోతుంది
ఆలిద్దరూ వొచ్చేస్తారింక
ఇయాల్టికి..
పుల్లల్తేలేదనీ సేప్ముక్క కుక్కకెట్టీసాననీ
ఇంతపిసరు జాగర్తలేదేమే ఎదవముండా అని
మొట్టికాయలెట్టకుండా అమ్మ
నన్నొదిలేస్తే బాగున్ను
నాన్న తాక్కుండా వొస్తే బాగున్ను
నంచుకోడాని నీసు లేకుండా సేసేవేమే అని
తన్నకుండా నాన్న
అమ్మనొదిలేస్తే బాగున్ను!
మాతో మీకు పోలికా?
_______________


సివంగి పరిగెత్తుతోంది
సత్తువంతా కూడదీసుకుని లేడిపిల్ల కూడా
రొప్పుతూ శరీరం గీరి రక్తం కారుతూ
ప్రాణ భయం తెగింపునీ బలాన్నీ పెంచుతోంది
బ్రతకడానికే అయినా ఆ వేట ఓ ఆట సివంగికి
ఆట ముగింపుకొచ్చింది లేడిపిల్ల ఓడింది
అబలత్వం, సబలత్వం ముందు మెడవంచింది
మెత్తని మెడ కండరాలు గట్టి దంతాల కొక్కీకి తగిలించబడి
వేళ్ళాడుతూ నెత్తురోడుతూ..
కళ్ళల్లో జీవముండీ చచ్చిన శరీరం
లాక్కెళ్ళబడుతోంది చెట్టు కిందికి
బలాబలాలమధ్య సమరం
ఓ మృగం మరో మృగానికి ఆహారం
ఇది నిత్యకృత్యం ఆ వనంలో !

నిండిన పిల్లల పొట్టలు చూస్తూ తృప్తిగా
కూచునుందిపుడు నీడలో సివంగి నిర్మలంగా
సాగిపోతోందపుడే ఓ లేళ్ళగుంపు పక్కగా
సివంగి లేవలేదు సరికదా
ఇంచైనా కదల్లేదు కూచున్న చోట్నించి
ఇదంతా..
సహజమైన ఓ అడవి దృశ్యం టీవీలో
అప్పుడే సివంగి కేమరా వైపు చూసిందేమో
నావైపే చూసినట్లనిపించింది
"అలా వదిలేసావేం, లేళ్ళు పోతున్నాయిగా
పట్టుకోవచ్చుగా రేపటికి దాచుకోవచ్చుగా?" అనడిగా
అప్పుడు విసిరిందో చూపు నావేపు
దాన్లో బోల్డర్ధాలు..

సంఘజీవులుగా బతకండని నోరూ తెలివీ దేముడు మీకిస్తే
వాటిని ఉంచుకుని మా క్రూరత్వాన్ని కూడా వంటబట్టించుకుని
ఒకర్నొకరు పీక్కుతింటున్నది చాలక సిగ్గులేక
నాకే సలహాలిస్తావా అన్నట్టూ_

ఎంతున్నా చాలక ధనదాహం తీరక
కుట్రలు కుతంత్రాలు ఎత్తుకు పై ఎత్తులు
బతకడానికి మేం చేసే పోరాటం ముందు
బట్టలు తొడుక్కుని నువు చేసే కిరాతకాలు
ఎంత నీచమో నాకు తెలీదనుకుంటున్నావా అని అడిగినట్టూ_

నవ్వుతూ నయవంచన చేసే నీచులు
మనిషి ముసుగేసుకున్న పిశాచులు
మాకంటే క్రూరకృత్యాలు చేస్తూ
గద్దల్లా రాబందుల్లా మృగాల్లా అంటూ
మా పేర్లు వాడుకుంటారేం?
'మానవుడిలా' అనే ఉపమానం మీరిచ్చినా మాకొద్దు
మీతో మాకు పోలికే వద్దు ఛీ.. థూ..అని కడిగేస్తున్నట్టూ_

నేనూరుకుంటానా, తెలివైనవాణ్ణి కదా
వెంటనే మార్చేసా ఛానెల్ !
మన్నించు బాపూ !


అబధ్ధ స్వార్ధ కపట కల్మషాలను
మంచానిక్కాళ్ళుగా చేసి దానిపై
కాళ్ళు చాపుకుని పడుకున్నాం
నువు మాకప్పజెప్పిన సత్యానికి మూతి కుట్టేసి
ఊపిరాడనంతగా గోనెసంచీలో మూటకట్టేసి
భద్రంగా అటకెక్కించాం
అది కుళ్ళు కంపు కొడుతుంటే
గురకెట్టి నిద్రపోతున్నాం
మన్నించు బాపూ !

అసూయ ద్వేషాల బ్రేక్‌ఫాస్ట్
దోపిడీ దౌర్జన్యాల లంచ్
హత్యా కిరాతకాల డిన్నర్
ఆరగిస్తూ అరిగించుకుంటున్నాం
నువు మాకిచ్చిన అహింసను
చితగ్గొట్టి హింసించి కైమాచేసి
మూడుపూటలా భోజనంతో
నంజుకుంటూ బ్రేవుమంటున్నాం
మన్నించు బాపూ !
మీరూ వస్తారా మాతో?


ఇదిగో ఇప్పుడే
చిన్నపిల్లనయిపోయా హఠాత్తుగా
కాదు ఎవరో మార్చేసారు
ఓ చిన్నపిల్లాడ్ని చూసాకే
ఇదంతా జరిగిందిలా
ఇక ఎప్పటికీ ఇలాగే
అవమన్నా అవనుగాక పెద్దదాన్ని
అసలెప్పటికీ వద్దు మాకీ
పెద్దరికాలు
మీరూ వస్తారా మాలోకంలోకి?

మీరూ వస్తే ..ఇక్కడ..
మాయలెరుగని అమాయకత్వాన్ని
తలా కాసింత పంచుకుందాం
ముసుగుల్లేని ముఖాలతో
ఒకర్నొకరు చూసుకు నవ్వుకుందాం
రండి మీరూ నేనూ అతనితో కలిసి
ఆడుకుందాం పాడుకుందాం
ఎప్పుడో మర్చిపోయిన
అమ్మప్రేమ తాయిలపు రుచిని
కలిసి కాకెంగిలి చేసుకు తిందాం
ఎన్నడో మరుగునపడిన
నాన్నకధల కొయ్యగుర్రమెక్కి
ఊరంతా తారంగం తిరిగొద్దాం
వీలైతే ఇంకా వెనక్కెళదాం

పతనమైన బాల్యపు గాలిపటాన్ని తీసి
ఎగరేసుకుందాం
కరిగిపోయిన కాలాన్ని వెనక్కి పిలిచి
తిరగేసుకుందాం
పసిదనపు ఇసుకగూళ్ళు మళ్ళీ
కట్టుకుందాం
పారిపోయిన జ్ఞాపకాలను వెతుక్కుని వెళ్ళీ
పట్టుకుందాం
వెలుగురేఖలు

ఛెంగుఛెంగున గెంతుకుంటూ వచ్చింది
మా బంగారుతల్లి
మిసమిసలాడే ముఖానికి
ముసిముసినవ్వు ఎప్పుడూ తోడుంటుంది
నాదాకా వెంటొచ్చిన ఆ నవ్వు
ఆగిందొక్కసారి ఎందుకో
చూపు దిగింది కిందికి
కుడికాలి బొటనవేలు గీతలు గీస్తోంది
ఉండుండి నాకేసి కళ్ళెత్తి చూస్తోంది
అర్ధమయింది చిట్టితల్లి
ఏదో కావాలని వచ్చింది
తను అడగాలే గానీ
ఇదిగో అని తెచ్చివ్వనూ ఏదైనా
బుజ్జగించి అడిగితే
బుంగమూతి సాయంతో బయటపెట్టింది
పక్కవీధి కొట్టుగుమ్మంలో వేలాడుతున్న
పచ్చరంగు పట్టుపరికిణీ కొనిపెట్టమని

ఏది చూపెట్టమని ఎత్తుకుని వెళ్లి చూస్తే
పరికిణీ బాగుంది గానీ
నా జేబుకే అంత స్తోమత లేదు
పచ్చపరికిణీ లో పాపాయి అందం
పాప కంటిలో మెరుపందం
చూడాలనీ ఉంది ఇప్పుడే జేబు ఖాళీ చేస్తే
నెలంతా కడుపు ఖాళీ ఎలా అన్న బెంగా ఉంది
పాప కోరికవెనుక అమాయకత్వం కంటే
నా మౌనం వెనుక నిస్సహాయత్వమే ముందు నిలిచింది

ఇంటికి తిరిగెళుతున్న పాపకి
దూరమవుతున్న పరికిణీ ఇంకా అక్కడే ఎందుకు
వేలాడుతుందో తెలీదు
పాతగౌనేసుకునే వచ్చింది పాప ఆరోజు
మిఠాయి తెచ్చి నోట్లో పెట్టింది
ఎప్పట్లాగే ఉంది పుట్టినరోజు సందడంతా
ఎప్పుడూ ఉండే పాపనవ్వుతప్ప
నా జేబుకి భారం లేనితనం
పాప చిరునవ్వుని దూరం చేసింది

మద్యాహ్నం భోజనానికింటికెళితే
నిద్రపోతోంది పాప
కలలోనే ఉందో కలతచెంది ఉందో
నిగారింపు తగ్గి ఉంది మోములో
నిద్రచెడిపిందో ఏమో నా అడుగుల సడి
పరుగెత్తి వచ్చింది చూపులు నా చేతిసంచిపై పడి
అప్పుడు మెరిసింది ఆ కన్నుల్లో
వేయి మతాబుల కాంతి
పట్టుపరికిణీ కోసం ప్రాణత్యాగం చేసిన
నా కిళ్ళీలడబ్బా
మళ్ళీ నాకళ్ళకి కనపడకపోయినా బాధలేదు
కోటి మెరుపుల వెలుగు రేఖల్ని చూపించింది
పాపాయి ముఖంలో
ఆ కాంతి నా మనసులోపల నిండి
ఈనాటికీ వెలుగుతూనే ఉంది
హితము

తొంబైతొమ్మిదిసార్లు వేసుకున్న ప్రశ్న
నీకేమి ఉన్నదని
సమాధానం వస్తుంది
ఏమీలేదనే
ఒక్కసారి నిన్ను నువ్వు అడిగితే
ఏమి లేదని నీకు
ఇస్తుందొక జవాబు
నువ్వే నమ్మలేవు తెలిసాక
లేనిదేది లేదంటే

విషాదం గట్టకట్టిన నీరులాంటిది
పైపైనే తెలుస్తుంది
కరిగిపోయే కాలమొస్తే
మిగిలున్నదంత సంతోష ప్రవాహమే
నువు చెయ్యాల్సినదేమీ లేదు
అందాకా నిన్ను నీవు నిలబెట్టడమే

ఒక్క క్షణం దుఃఖం
మరు నిముషమె ఆనందం
దుఃఖమంటె ఏమున్నది
సుఖానికి సుఖానికి మధ్య విరామమే కదా
కలతపడిన క్షణమందున
హితముచెప్పు ఎవరైనా
స్నేహితుడే నీకన్నది విదితమే కదా
వెన్నెల రేయి

ఎదురుచూసి ఎదురుచూసి కనులకేమొ అలుపయ్యింది
ఎదనుతాకి మదినిదోచి మరువలేని తలపయ్యింది

సుఖమునెంచి కన్నెమనసు పంజరమున చిలకయ్యింది
సఖునికినుక తాళలేని చెలియకిదియె అలకయ్యింది

సగమురేయి సిగమల్లెల పరిమళమె సెగలయ్యింది
మరునితెలుపు వలపేదో తనువుచేరి వగలయ్యింది

తలచినంత చెంతచేరు తరుణమేమొ కరువయ్యింది
విరహబాధ ఓర్వలేని హృదయమింక బరువయ్యింది

వెన్నెలమ్మ చందమామ సరసమపుడె మొదలయ్యింది
ప్రియునిరాక కానరాక గుండెకిపుడు గుబులయ్యింది

ప్రేమచిలుకు సమయమంత కరిగితరిగి కల అయ్యింది
ప్రణయసీమ సరిహద్దులొ ఆమెచూపు శిల అయ్యింది
ఊహలరెక్కలు


నిజాలెలాగూ దూరం
కల అయినా దరికొస్తుందనుకున్నా

కలకోసం కాచుక్కూచుంటే
నిద్రకూడా రాలేదు
ఇద్దరూ కలిసి ఎక్కడికెళ్ళారో !

కలవస్తే నువ్వూ వస్తావనుకున్నా
ఆరెంటితో కలిసి
ముగ్గురూ ఓ జట్టయారన్నమాట!

కనురెప్పల నడిగా
మీజాడేమైనా తెలుసేమోనని
వాటికీ నామీద అలుకేమో రెపరెపలే తప్ప
పెదవివిప్పి పలికితేనా!

జామురేయినడిగా
ఇంతసేపైనా మీరురారేమని
నక్షత్రాలు తనతోడున్నాయని ధీమా
నామాటొక లెక్కా?

ఊయలలూగే మనసుకి ఇక ఒక్కరే దిక్కు
కళ్ళుమూసుకోగానే తెరుచుకునే
ఊహలరెక్కలు !

ఆరెక్కలమీదెక్కి అటూఇటూ తిరిగానా
ఓచోట నువ్వు కనపడ్డావు
ముసిముసినవ్వుల కొంటెచూపుతో!

నన్నొదిలి ఇంతదూరమెందుకెళ్ళావని
అడిగితే అలిగితే
ఈసారి నీది పకపక నవ్వు
'ఊరంతా తిరిగింది నువ్వు
నేనిక్కడే ఉన్నాగా' అని నువ్వంటుంటే
అప్పుడు చూసా నువ్వున్నచోటు నాదేనని
నా హృదయానిదని!

నా గజల్ 

ఓ నా గజల్ !
నువ్వు..
జీవిత రహదారిలో నాకెదురైన
గతజన్మ స్నేహానివి
తలుపుతట్టి నా అలసత్వాన్ని నిద్రలేపిన
అనుకోని ఆగమనానివి
తిరిగిపోని శాస్వత అతిథివి

నువ్వో ఆనందానివి ఆహ్లాదానివి
నీ పదాల పలకరింతతో
గిలిగింతలు పెట్టే కౌగిలింతవి

నువ్వో ప్రణయానివి
ఉండుండీ మనసుని కల్లోలంలో
ముంచెత్తేసే ప్రవాహానివి

నువ్వో సంగీత ఝరివి
హృదినదీ తీరాన
స్మృతి చెలమల్లో ఊరే ఆర్ద్రతవి

నీ మత్లా మోవిపై ముద్దిడుతూ మొదలుపెట్టి
ప్రతి షేర్నూ మనసుతో మెత్తగా హత్తుకుని
నీ భావానురక్తిలో గళాన్ని లయింపజేసి
చరమాంకంలో నీచరణాల అంచున
మఖ్తాలో చోటుంటే ఓ పదమై ఒదిగిపోతాను

నువ్వు నేను దూరమయేది అప్పుడే
నేలపై ఈ శరీరం శాస్వతంగా ఒరిగిపోయినప్పుడే
మాంత్రికుడు

నువు పేర్చిన అక్షరాలకి రెక్కలొచ్చి
వయారంగా నావైపు ఎగిరొచ్చి
నువు అద్దిన భావ పరిమళాన్నంతా
నామీద కుమ్మరించాయి
ఏమ్మత్తు చల్లి పంపావో
గమ్మత్తు చేసి పోయాయి
ఏమంత్రమేసి వదిలావో
కనికట్టు చేసి కదిలాయి

నువు కూర్చిన పదాలకు పదములొచ్చి
నాజూకుగా నాదరికి నడచివచ్చి
నువు నేర్పిన అర్ధవిద్యలన్నీ
నాముందు ప్రదర్శించాయి
ఏమ్మాయ చేయదలిచావో
వలపించి వదలిపోయాయి
ఏవింత చేత మలిచావో
కవ్వింత కల్గించి పోయాయి

నువు అల్లిన పాదాలకు ప్రాణమొచ్చి
సజీవంగా నావైపు దూసుకొచ్చి
నీకవిత్వధారలో మునిగితేలినవేమో
నన్నూ తడిపి ముద్దచేసాయి
ఏం మందు కలిపి పంపావో
క్షణమందు వశం చేసుకున్నాయి
ఏసుగంధ ద్రవ్యమద్దావో
మనసంత వ్యాపించిపోయాయి
జయహో కవిత్వం

ఈరోజు ఖాళీగా ఉంది
ఇల్లూ మెదడూ కూడా
బయటికెళ్ళేందుకూ లేదు ఆగకుండా వర్షం
చేసేందుకు పనులూ లేవు
సిగ్నల్ లేదేమో టీవీ మాట్లాడ్డం లేదు
రీచార్జికి డబ్బుల్లేవు
ఎవరికైనా కాల్చేసి మెదడు పీల్చేయడానికి
ఇక మిగిలిందొకటే
కవిత్వం!
రాసేస్తే పోలా?

నేనూ కాగితం కదలకుండా కూచుంటే
కలం రాసిందో ఇరవైలైన్ల కవిత
అరగంటలో పుట్టినా
బుజ్జిముండ ఎంత ముద్దొస్తోందో!
ఇక తదుపరి ఆట చప్పట్లవేట
ముఖపుస్తకముందిగా అక్కడ పడేస్తే పోలా?
మరో ఇరవైనాలుగ్గంటలకి కావలసినంత పని
అనుమానం లేదు
అరవై లైకులూ ఇరవై కామెంట్లూ గారంటీ
పడకపోతే ఊరుకుంటామా
పర్సనల్ గా గుర్తుచేయమూ
స్పెషల్ ఇంట్రస్ట్, ఇంప్రెసింగ్ ఇంటెన్షన్ లాంటి యాక్ట్సూ
ముట్యువల్ అండర్‌స్టాండింగ్ లాంటి కాంట్రాక్ట్సూ
పనిచేస్తుంటాయెలాగూ ఓపక్కనుండి
సెకన్లో ముద్రణయింది
ఇప్పుడు మొదలయ్యిందసలైన ఆరాటం
నెత్తిన కొత్తబరువు తగిలించినపుడల్లా
కిందికి జారే పేజీని
పైకి లాగే పోరాటం..
పడుతూనే ఉన్నాయి లైకులూ వ్యాఖ్యలూ

ఇదా కవిత్వమంటూ
మనసు మూల్గుతున్నా
ప్రొత్సాహం ఆగకూడదనుకుందేమో
కాసేపాగి
కవిత్వం కావాలసలైన కవిత్వం కావాలనే నినాదాన్ని
గుర్తు చేస్తూ
జయహో కూడా పడింది











సహజీవనం

 

ఒకరిలో ఒకరు
ఒదిగిపోయి
దగ్గరగా.. మరింత దగ్గరగా..
దాహాలు తీరేదాకా
ఆర్తిగా అల్లుకుపోయి
మోహాలు కరిగేదాకా
పూర్తిగా కొట్టుకుపోయి
తీరం చేరిన దేహాలు..

ప్రణయసంగమం కాదది
కలిసి విడివిడిగా తీర్చుకుంటున్న
అవసరం

మమకారం కాదది
ఒకరికొకరు చేసుకుంటున్న
ఉపకారం

అనుబంధం కాదది
ఒద్దంటే తెంచుకునే వీలున్న
ఒప్పందం

దాపత్యం కాదది
విద్యనేర్చిన వింతపశువులు చేస్తున్న
అనాగరికం

సహజీవనమట
జీవనమా అది?
అస్తవ్యస్త పయనం!
అపస్వరాల గానం !!

('లివింగ్ టుగెదర్ వితౌట్ మేరేజ్' కల్చర్ మనవాళ్ళకి కూడా వంటబడుతుండడం తెలిసి బాధతో.. )

నాలోని నువ్వు














కనుచూపు మేరంతా  కనిపిస్తున్నావు
నా కంటిపాప లో కొలువున్నావా?

గుండె భారంగా ఉంది
నువ్వు మరీ ఇంత బరువా?

నాలుక ఏం పలికినా నీపేరే వస్తోంది బయటికి
స్వరపేటికను స్వాధీన పరుచుకున్నావా?

ఏ వైపూ దారి లేదు మనసు గదికి
ఎలా చొరబడ్డావు దొంగవా?

నా ప్రతి కదలికనూ శాసిస్తున్నావు
కండరనరాలన్నిటినీ ఆక్రమించావా?

నీతలపు తప్ప మరేం చేయనని మొరాయిస్తోంది మెదడు
ఏకచత్రాధిపత్యం సాగిస్తున్నావా?

ఇదేం చిత్రం, నా అద్దం నిన్ను చూపిస్తోంది
నేనే నువ్వయిపోయావా?

పెర్ ఫెక్ట్ ట్రీట్ మెంట్

 

















 
ముదిరే దాకా మేం గుర్తుకురామా?
మందలిస్తూ మందులిచ్చాడు
మా కుటుంబ వైద్యుడు..

ఏం భయం లేదు పిచ్చీ, నేనున్నాగా!
వెచ్చగా భరోసా ఇచ్చాడు
నన్ను కట్టుకున్నోడు..

రెండో ట్రీట్ మెంటే
ముందుగా పనిచేసింది !
 

క్రానిక్ డిసీజ్

అదేపనిగా ఒకేపేరు ఉచ్ఛరించడం
పదేపదే అదేరూపు నిదుర చెడగొట్టడం
మళ్ళీ మళ్ళీ ఏదో ఒకటి మాట్లాడాలనుకోవడం
ఒక్క సారైనా ఎలాగోలా కలవాలనుకోవడం
ఇలాంటివే ఇంకా ఎన్నో…ఇండికేషన్స్


అపుడపుడూ శరీరం స్వాధీనం తప్పడం
ఉండుండీ మెదడేమో మొద్దుబారడం
రాను రానూ మనసేమో వశం తప్పడం
ఇంచుమించు ఇహపరాలు మర్చిపోవడం
ఇవికాక మరెన్నో… సింప్టమ్స్ 

 
ఇదేదో జబ్బేమోనని ఎవరో చెబితే
మంచి డాక్టరని నమ్మివెళితే
పల్సు చూడలేదు పిల్సూ ఇవ్వలేదు
కళ్ళజోడొకసారి పైకెత్తి నావైపు
తెల్లబోయి చూసిందా తెల్లకోటు
కళ్ళు మూసుకొనుండిపోయి కాసేపు
తెల్లకాగితం చూపాడు ప్రిస్క్రిప్షనంటు



అటుఇటు తిప్పిచూసా ఏమీలేదు
తెల్లబోవడం ఇపుడు నావంతు
ఆనక ఇచ్చాడొక చీటీ
అక్కడ రాసుందిలా..

“ఆఒక్కటీ అడక్కు ప్లీజ్
తెలిస్తే నేనే నయం చేసుకోనూ
ఇరవయ్యేళ్ళ నా ఈ క్రానిక్ డిసీజ్ ?”

తపోయోగం

పంజరమే..
లోపల చిక్కుకుని
గిలగిలా కొట్టుకోవడం నచ్చిన
అందమైన బందిఖానా ఇది

శిరసావహమే..
లోపలికి నెట్టి గడియ పెట్టిన
నీ ఆజ్ఞ !
అమూల్యమైన నజరానా ఇది

నయనసదృసమే..
చూట్టూ నిలబెట్టిన
నీవేలిముద్రలు పొదిగిన ఇనుపచువ్వలు !
అపురూప ఖజానా నాకిది

పరవశమే..
ఇక్కడ వదిలెళ్ళిన
నీఊపిరి తరంగ రవళి !
అదురుగుండె కదిలించు సహానా ఇది


ఆనందాతిరేకమే..
నీసడి కోసం సవ్వడి కోసం
నీ వేలికొస కోసం
దీక్షగా నిరీక్షించు తపోయోగమిది.
 రియల్ ఫీస్టు

ఏమండోయ్
ఇవాళ మీకోసమొక సరికొత్త విందు
ఇదిగో పళ్ళెం నిండా వేడివేడి కవిత
అందుబాటుగా అధరువులివిగో
హల్వాలాంటి హైకూ, రుచికరమైన రూబయీ
కలుపుకోడానికి నానీ..ఇక లాగించండి

అదేమిటలా పెదవి విరిచేస్తున్నారు?
ఆగండాగండి..
ఫ్లేవరు సరిపోలేదా, ఓరెండు
ఫెంటోలు తగిలిస్తాగా! కూర్చోండి
ఇదిగో మీరడగకపోయినా
ఘుమఘుమలాడే ఘజలొకటి మీకు స్పెషల్
మొహమేమిటలా పెట్టేరు?
నంజుకోడానికోనాలుగు
నానోలు వడ్డిస్తాలెండి
ఇంకేం కావాలండీ? ఓహో
గార్నిషింగ్ మిస్సింగా?
ఇదో..పైన జల్లుతున్నాగా
కరకరలాడేందుకు కార్టూన్లు!

భలేవారే, అలా అసంతృప్తిగా వెళ్ళిపోతారేం?
పోతే పోయేరు ఏదైనా చెప్పిపొండి
చెప్పేంతగా ఏమీ లేదంటారా?
అంతా ఆరగించేసి
అలా లోలోపలే బ్రేవ్ మనిపించేసుకోక
ఒక్క లైకైనా కొట్టిపోవచ్చుగా!
ఆగి..వెనుతిరిగారు శ్రీవారు!!
ఆశగా చూసా..
"చూడూ, కావాలంటే..
నీ ఫేసు చూపించు ఎంతసేపైనా చూస్తా
నీ ఫేస్బుక్కు మాత్రం ఇంకెప్పుడూ చూపించకు"
జ్యోతిర్మయి మళ్ళ ||రియల్ ఫీస్టు||

(అడ్మిన్ గారికి మనవి: అప్పుడప్పుడూ కవితకు తగిన బొమ్మ గీయడం అలవాటు నాకు..కష్టపడి, ఇష్టపడి  గీసిన బొమ్మ లేకుండా కవిత పోస్ట్ చెయ్యడానికి మనసొప్పదు..దయచేసి అలౌ చెయ్యాలి) 

ఏమండోయ్
ఇవాళ మీకోసమొక సరికొత్త విందు 
ఇదిగో పళ్ళెం నిండా వేడివేడి కవిత
అందుబాటుగా అధరువులివిగో
హల్వాలాంటి హైకూ, రుచికరమైన రూబయీ
కలుపుకోడానికి నానీ..ఇక లాగించండి

అదేమిటలా పెదవి విరిచేస్తున్నారు?
ఆగండాగండి..
ఫ్లేవరు సరిపోలేదా, ఓరెండు
ఫెంటోలు తగిలిస్తాగా! కూర్చోండి
ఇదిగో మీరడగకపోయినా
ఘుమఘుమలాడే ఘజలొకటి మీకు స్పెషల్
మొహమేమిటలా పెట్టేరు?
నంజుకోడానికోనాలుగు
నానోలు వడ్డిస్తాలెండి
ఇంకేం కావాలండీ? ఓహో
గార్నిషింగ్ మిస్సింగా?
ఇదో..పైన జల్లుతున్నాగా
కరకరలాడేందుకు కార్టూన్లు!

భలేవారే, అలా అసంతృప్తిగా వెళ్ళిపోతారేం?
పోతే పోయేరు ఏదైనా చెప్పిపొండి
చెప్పేంతగా ఏమీ లేదంటారా?
అంతా ఆరగించేసి
అలా లోలోపలే బ్రేవ్ మనిపించేసుకునేబదులు 
ఒక్క లైకైనా కొట్టిపోవచ్చుగా!

ఆగి..వెనుతిరిగారు శ్రీవారు!!
ఆశగా చూసా..
"చూడూ, కావాలంటే..
నీ ఫేసు చూపించు ఎంతసేపైనా చూస్తా
నీ ఫేస్బుక్కు మాత్రం ఇంకెప్పుడూ చూపించకు"

రాయబారి 

 

నాకు తానూ
తనకి నేనూ

నీకన్నా దూరం..

ఇలా
మా ఇద్దరికీ కనిపిస్తూ
అలా
వెన్నెల నవ్వులు కురిపిస్తూ
మాపై నువ్వు చల్లేది
చల్లదనమని అనుకోకు

మాలో
తాపాగ్నిని రేపిన పాపానికి
ప్రాయశ్చిత్తం..
నువ్వు మాకు రాయబారి అవడమే

ఈ కంటి చూపు ఆ కంటి దాకా
ఆ గుండె బాధ ఈ గుండె దాకా
చేర్చి కూర్చే బాధ్యత నీదే !
 
రాయబారి //జ్యోతిర్మయి మళ్ళ //
 ________
 
నాకు తానూ
 తనకి నేనూ

 నీకన్నా దూరం..
 
ఇలా 
మా ఇద్దరికీ కనిపిస్తూ
 అలా 
వెన్నెల నవ్వులు కురిపిస్తూ
 మాపై నువ్వు చల్లేది 
చల్లదనమని అనుకోకు
 
మాలో
 తాపాగ్నిని రేపిన పాపానికి
 ప్రాయశ్చిత్తం..
 నువ్వు మాకు రాయబారి అవడమే
 
ఈ కంటి చూపు ఆ కంటి దాకా
 ఆ గుండె బాధ ఈ గుండె దాకా
 చేర్చి కూర్చే బాధ్యత నీదే !

దృశ్యం 

నువుకనపడని నా ప్రపంచం శూన్యమనీ

నువు నిండి వున్న మనసు తప్ప

నాలో మిగిలిందంతా వ్యర్ధమనీ

నీకూ నాకూ మధ్య అవధులనంతమనీ

మరుజన్మ తప్ప నినుచేరే మార్గం

ఇపుడిక మరి లేదనీ

ఇన్నాళ్ళూ అనుకున్నా..

కానీ..

ఆనాటి దుఖంలో

గుండె అగ్నిపర్వతంలా మండి

ఆసెగలో

మది అద్దం పగిలి తునాతునకలై ఎగిరి

తనలోని నిన్ను

ప్రకృతిలోని ప్రతి అణువునా చేర్చిందని

నా చూపు పడిన ప్రతి చోటా..

మట్టిలో, మొక్కలో, వికసించే మొగ్గలో

గగనంలో, గాలిలో, వర్షించే మేఘంలో

రాళ్ళలో, రంగుల్లో, ఎగిరే విహంగంలో

చంద్రుడిలో సూర్యుడిలో ఎదురయ్యే ప్రతిమనిషిలో

..పరావర్తనమై

నాక్కనిపిస్తున్నది నువ్వేనని

ఇన్నాళ్ళకు తెలుసుకున్నా!

తెలుగు తల్లికి అచ్చుల అక్షరమాల...!




బ్లాగు మితృలందరికీ నమస్కారములు!

ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా నాకు వచ్చిన ఆలోచన భాషాభిమానం పేరిట అచ్చులతో చిత్రాలు గీసాను. శ్రీ అద్దేపల్లి రామ్మోహనరావు గారు రాసిన చక్కని తెలుగు పాటకు స్వరకల్పన చేసి పాడి ఈ చిత్రాలకు జతచేసి ఒక వీడియోగా చేసాను..ఈ నా చిన్ని ప్రయత్నముపై తమ అమూల్యమైన అభిప్రాయములను గ్రూపులోనూ యూట్యూబు లోనూ పోస్ట్ చేయగలరని ఆశిస్తున్నాను 

మీ
జ్యోతిర్మయి మళ్ళ