దినదినగండం
___________

మరీ మరీ సెప్పెల్లింది
ఎనకాల సెక్కతలుపు సారేసి
గొల్లెం సరీగా ఎట్టమని
గొల్లెం ఎడితే మాత్రం ఏటి
సెక్కే ఇరిగిపోయున్నాది
అదో లెక్కేటి ఆ ఎదవ కుక్కకి?
నాన్నకని దాసింది ఎండుసేప్ముక్క
మద్దేనం ఎంతాకలేసిందో
మూత్తీసి ఓపాలి వాసన సూసాను గానీ
తినీసినా బాగున్ను!

రాత్రి గెంజికాయడానికి
పుల్లల్తెచ్చెట్టమంది
ఈ ఎదవ ఒక నిమసమేనా వదిల్తేనా?
సంకదించితే సాలు
ఊరంతా ఇనపడేలా గోల గోల
నాన్నకి టీజేసిచ్చినాక మిగిల్న
అరగ్లాసు పాలు ఎప్పుడో పొద్దున్నే
అవజేసీసేడు
మద్దేనం నీల్లల్లో మైదాపిండి కలిపి
సీసా నోట్లో ఎడితే
నాయేపదోలా సూసాడు గానీ
అన్నీ తాగీసేడు

సీకటడిపోతుంది
ఆలిద్దరూ వొచ్చేస్తారింక
ఇయాల్టికి..
పుల్లల్తేలేదనీ సేప్ముక్క కుక్కకెట్టీసాననీ
ఇంతపిసరు జాగర్తలేదేమే ఎదవముండా అని
మొట్టికాయలెట్టకుండా అమ్మ
నన్నొదిలేస్తే బాగున్ను
నాన్న తాక్కుండా వొస్తే బాగున్ను
నంచుకోడాని నీసు లేకుండా సేసేవేమే అని
తన్నకుండా నాన్న
అమ్మనొదిలేస్తే బాగున్ను!

0 comments:

Post a Comment