మాంత్రికుడు

నువు పేర్చిన అక్షరాలకి రెక్కలొచ్చి
వయారంగా నావైపు ఎగిరొచ్చి
నువు అద్దిన భావ పరిమళాన్నంతా
నామీద కుమ్మరించాయి
ఏమ్మత్తు చల్లి పంపావో
గమ్మత్తు చేసి పోయాయి
ఏమంత్రమేసి వదిలావో
కనికట్టు చేసి కదిలాయి

నువు కూర్చిన పదాలకు పదములొచ్చి
నాజూకుగా నాదరికి నడచివచ్చి
నువు నేర్పిన అర్ధవిద్యలన్నీ
నాముందు ప్రదర్శించాయి
ఏమ్మాయ చేయదలిచావో
వలపించి వదలిపోయాయి
ఏవింత చేత మలిచావో
కవ్వింత కల్గించి పోయాయి

నువు అల్లిన పాదాలకు ప్రాణమొచ్చి
సజీవంగా నావైపు దూసుకొచ్చి
నీకవిత్వధారలో మునిగితేలినవేమో
నన్నూ తడిపి ముద్దచేసాయి
ఏం మందు కలిపి పంపావో
క్షణమందు వశం చేసుకున్నాయి
ఏసుగంధ ద్రవ్యమద్దావో
మనసంత వ్యాపించిపోయాయి

0 comments:

Post a Comment