మాతో మీకు పోలికా?
_______________


సివంగి పరిగెత్తుతోంది
సత్తువంతా కూడదీసుకుని లేడిపిల్ల కూడా
రొప్పుతూ శరీరం గీరి రక్తం కారుతూ
ప్రాణ భయం తెగింపునీ బలాన్నీ పెంచుతోంది
బ్రతకడానికే అయినా ఆ వేట ఓ ఆట సివంగికి
ఆట ముగింపుకొచ్చింది లేడిపిల్ల ఓడింది
అబలత్వం, సబలత్వం ముందు మెడవంచింది
మెత్తని మెడ కండరాలు గట్టి దంతాల కొక్కీకి తగిలించబడి
వేళ్ళాడుతూ నెత్తురోడుతూ..
కళ్ళల్లో జీవముండీ చచ్చిన శరీరం
లాక్కెళ్ళబడుతోంది చెట్టు కిందికి
బలాబలాలమధ్య సమరం
ఓ మృగం మరో మృగానికి ఆహారం
ఇది నిత్యకృత్యం ఆ వనంలో !

నిండిన పిల్లల పొట్టలు చూస్తూ తృప్తిగా
కూచునుందిపుడు నీడలో సివంగి నిర్మలంగా
సాగిపోతోందపుడే ఓ లేళ్ళగుంపు పక్కగా
సివంగి లేవలేదు సరికదా
ఇంచైనా కదల్లేదు కూచున్న చోట్నించి
ఇదంతా..
సహజమైన ఓ అడవి దృశ్యం టీవీలో
అప్పుడే సివంగి కేమరా వైపు చూసిందేమో
నావైపే చూసినట్లనిపించింది
"అలా వదిలేసావేం, లేళ్ళు పోతున్నాయిగా
పట్టుకోవచ్చుగా రేపటికి దాచుకోవచ్చుగా?" అనడిగా
అప్పుడు విసిరిందో చూపు నావేపు
దాన్లో బోల్డర్ధాలు..

సంఘజీవులుగా బతకండని నోరూ తెలివీ దేముడు మీకిస్తే
వాటిని ఉంచుకుని మా క్రూరత్వాన్ని కూడా వంటబట్టించుకుని
ఒకర్నొకరు పీక్కుతింటున్నది చాలక సిగ్గులేక
నాకే సలహాలిస్తావా అన్నట్టూ_

ఎంతున్నా చాలక ధనదాహం తీరక
కుట్రలు కుతంత్రాలు ఎత్తుకు పై ఎత్తులు
బతకడానికి మేం చేసే పోరాటం ముందు
బట్టలు తొడుక్కుని నువు చేసే కిరాతకాలు
ఎంత నీచమో నాకు తెలీదనుకుంటున్నావా అని అడిగినట్టూ_

నవ్వుతూ నయవంచన చేసే నీచులు
మనిషి ముసుగేసుకున్న పిశాచులు
మాకంటే క్రూరకృత్యాలు చేస్తూ
గద్దల్లా రాబందుల్లా మృగాల్లా అంటూ
మా పేర్లు వాడుకుంటారేం?
'మానవుడిలా' అనే ఉపమానం మీరిచ్చినా మాకొద్దు
మీతో మాకు పోలికే వద్దు ఛీ.. థూ..అని కడిగేస్తున్నట్టూ_

నేనూరుకుంటానా, తెలివైనవాణ్ణి కదా
వెంటనే మార్చేసా ఛానెల్ !

0 comments:

Post a Comment