నాలోని నువ్వు














కనుచూపు మేరంతా  కనిపిస్తున్నావు
నా కంటిపాప లో కొలువున్నావా?

గుండె భారంగా ఉంది
నువ్వు మరీ ఇంత బరువా?

నాలుక ఏం పలికినా నీపేరే వస్తోంది బయటికి
స్వరపేటికను స్వాధీన పరుచుకున్నావా?

ఏ వైపూ దారి లేదు మనసు గదికి
ఎలా చొరబడ్డావు దొంగవా?

నా ప్రతి కదలికనూ శాసిస్తున్నావు
కండరనరాలన్నిటినీ ఆక్రమించావా?

నీతలపు తప్ప మరేం చేయనని మొరాయిస్తోంది మెదడు
ఏకచత్రాధిపత్యం సాగిస్తున్నావా?

ఇదేం చిత్రం, నా అద్దం నిన్ను చూపిస్తోంది
నేనే నువ్వయిపోయావా?

2 comments:

vemulachandra

ఏ వైపూ దారి లేదు మనసు గదికి .... ఎలా చొరబడ్డావో దొంగా!?
చక్కని భావన, చాలా బాగుంది.
అభినందనలు జ్యోతిర్మయీ!

జ్యోతిర్మయి ప్రభాకర్

ధన్యవాదాలు చంద్రశేఖర్ గారు

Post a Comment