వెలుగురేఖలు
ఛెంగుఛెంగున గెంతుకుంటూ వచ్చింది
మా బంగారుతల్లి
మిసమిసలాడే ముఖానికి
ముసిముసినవ్వు ఎప్పుడూ తోడుంటుంది
నాదాకా వెంటొచ్చిన ఆ నవ్వు
ఆగిందొక్కసారి ఎందుకో
చూపు దిగింది కిందికి
కుడికాలి బొటనవేలు గీతలు గీస్తోంది
ఉండుండి నాకేసి కళ్ళెత్తి చూస్తోంది
అర్ధమయింది చిట్టితల్లి
ఏదో కావాలని వచ్చింది
తను అడగాలే గానీ
ఇదిగో అని తెచ్చివ్వనూ ఏదైనా
బుజ్జగించి అడిగితే
బుంగమూతి సాయంతో బయటపెట్టింది
పక్కవీధి కొట్టుగుమ్మంలో వేలాడుతున్న
పచ్చరంగు పట్టుపరికిణీ కొనిపెట్టమని
ఏది చూపెట్టమని ఎత్తుకుని వెళ్లి చూస్తే
పరికిణీ బాగుంది గానీ
నా జేబుకే అంత స్తోమత లేదు
పచ్చపరికిణీ లో పాపాయి అందం
పాప కంటిలో మెరుపందం
చూడాలనీ ఉంది ఇప్పుడే జేబు ఖాళీ చేస్తే
నెలంతా కడుపు ఖాళీ ఎలా అన్న బెంగా ఉంది
పాప కోరికవెనుక అమాయకత్వం కంటే
నా మౌనం వెనుక నిస్సహాయత్వమే ముందు నిలిచింది
ఇంటికి తిరిగెళుతున్న పాపకి
దూరమవుతున్న పరికిణీ ఇంకా అక్కడే ఎందుకు
వేలాడుతుందో తెలీదు
పాతగౌనేసుకునే వచ్చింది పాప ఆరోజు
మిఠాయి తెచ్చి నోట్లో పెట్టింది
ఎప్పట్లాగే ఉంది పుట్టినరోజు సందడంతా
ఎప్పుడూ ఉండే పాపనవ్వుతప్ప
నా జేబుకి భారం లేనితనం
పాప చిరునవ్వుని దూరం చేసింది
మద్యాహ్నం భోజనానికింటికెళితే
నిద్రపోతోంది పాప
కలలోనే ఉందో కలతచెంది ఉందో
నిగారింపు తగ్గి ఉంది మోములో
నిద్రచెడిపిందో ఏమో నా అడుగుల సడి
పరుగెత్తి వచ్చింది చూపులు నా చేతిసంచిపై పడి
అప్పుడు మెరిసింది ఆ కన్నుల్లో
వేయి మతాబుల కాంతి
పట్టుపరికిణీ కోసం ప్రాణత్యాగం చేసిన
నా కిళ్ళీలడబ్బా
మళ్ళీ నాకళ్ళకి కనపడకపోయినా బాధలేదు
కోటి మెరుపుల వెలుగు రేఖల్ని చూపించింది
పాపాయి ముఖంలో
ఆ కాంతి నా మనసులోపల నిండి
ఈనాటికీ వెలుగుతూనే ఉంది
0 comments:
Post a Comment