నా గజల్
ఓ నా గజల్ !
నువ్వు..
జీవిత రహదారిలో నాకెదురైన
గతజన్మ స్నేహానివి
తలుపుతట్టి నా అలసత్వాన్ని నిద్రలేపిన
అనుకోని ఆగమనానివి
తిరిగిపోని శాస్వత అతిథివి
నువ్వో ఆనందానివి ఆహ్లాదానివి
నీ పదాల పలకరింతతో
గిలిగింతలు పెట్టే కౌగిలింతవి
నువ్వో ప్రణయానివి
ఉండుండీ మనసుని కల్లోలంలో
ముంచెత్తేసే ప్రవాహానివి
నువ్వో సంగీత ఝరివి
హృదినదీ తీరాన
స్మృతి చెలమల్లో ఊరే ఆర్ద్రతవి
నీ మత్లా మోవిపై ముద్దిడుతూ మొదలుపెట్టి
ప్రతి షేర్నూ మనసుతో మెత్తగా హత్తుకుని
నీ భావానురక్తిలో గళాన్ని లయింపజేసి
చరమాంకంలో నీచరణాల అంచున
మఖ్తాలో చోటుంటే ఓ పదమై ఒదిగిపోతాను
నువ్వు నేను దూరమయేది అప్పుడే
నేలపై ఈ శరీరం శాస్వతంగా ఒరిగిపోయినప్పుడే
0 comments:
Post a Comment