జయహో కవిత్వం

ఈరోజు ఖాళీగా ఉంది
ఇల్లూ మెదడూ కూడా
బయటికెళ్ళేందుకూ లేదు ఆగకుండా వర్షం
చేసేందుకు పనులూ లేవు
సిగ్నల్ లేదేమో టీవీ మాట్లాడ్డం లేదు
రీచార్జికి డబ్బుల్లేవు
ఎవరికైనా కాల్చేసి మెదడు పీల్చేయడానికి
ఇక మిగిలిందొకటే
కవిత్వం!
రాసేస్తే పోలా?

నేనూ కాగితం కదలకుండా కూచుంటే
కలం రాసిందో ఇరవైలైన్ల కవిత
అరగంటలో పుట్టినా
బుజ్జిముండ ఎంత ముద్దొస్తోందో!
ఇక తదుపరి ఆట చప్పట్లవేట
ముఖపుస్తకముందిగా అక్కడ పడేస్తే పోలా?
మరో ఇరవైనాలుగ్గంటలకి కావలసినంత పని
అనుమానం లేదు
అరవై లైకులూ ఇరవై కామెంట్లూ గారంటీ
పడకపోతే ఊరుకుంటామా
పర్సనల్ గా గుర్తుచేయమూ
స్పెషల్ ఇంట్రస్ట్, ఇంప్రెసింగ్ ఇంటెన్షన్ లాంటి యాక్ట్సూ
ముట్యువల్ అండర్‌స్టాండింగ్ లాంటి కాంట్రాక్ట్సూ
పనిచేస్తుంటాయెలాగూ ఓపక్కనుండి
సెకన్లో ముద్రణయింది
ఇప్పుడు మొదలయ్యిందసలైన ఆరాటం
నెత్తిన కొత్తబరువు తగిలించినపుడల్లా
కిందికి జారే పేజీని
పైకి లాగే పోరాటం..
పడుతూనే ఉన్నాయి లైకులూ వ్యాఖ్యలూ

ఇదా కవిత్వమంటూ
మనసు మూల్గుతున్నా
ప్రొత్సాహం ఆగకూడదనుకుందేమో
కాసేపాగి
కవిత్వం కావాలసలైన కవిత్వం కావాలనే నినాదాన్ని
గుర్తు చేస్తూ
జయహో కూడా పడింది

0 comments:

Post a Comment