నిశ్శబ్ద నిశీధి
 
 
                                                ఎప్పటిలాగే ఈయేడూ వచ్చిందేమో ఉగాది
నాముక్కును చేరుతోంది మామిడిపిందెల వేపపూతల వాసన
నాగుండెగదిలో ఘనీభవించిన
అనుభూతుల సారాలు కరిగి పొరలుపొరలుగా
జారుతున్నాయిపుడు జ్ఞాపకాలుగా..

ఆటలు పాటలు అమ్మ లాలనలు
కధలూ కబుర్లు నాన్న ఆలనలు
ప్రతిదినమూ సంబరమే అల్లరేమొ అంబరమే
ముసుగేలేని పసితనం మాయలే యెరుగని బాల్యం
నాకప్పుడేరుచీ తెలీదు ఒక్క తీపితప్ప

ఉలుకులు కులుకులు సిగ్గుసింగారాలు
బిగిసిన పరువాలు బింకపు బిడియాలు
వళ్ళంతా వయ్యారమే అనువణువూ పులకరమే
ఎల్లలులేని ఆనందం తిరుగేలేని తారంగం
అది వగరుపొగరుల యవ్వనపర్వం

ప్రణయం పరిణయం అతనితో అనుబంధం
ఇద్దరివీ ఒక్కటైన ఆశలు ఆశయాలు
ప్రతిరేయీ పరవశమే ప్రకృతితో సహవాసమే
అనురాగం అంకురించిన తరుణం..
ఒక్కరిద్దరవడం తరుణికది నిజంగా ఒకవరం
ఊహలన్నీ మధురమే అయినా నోట పులుపు తగిలితేనే పులకరం

ఇల్లు పిల్లలు ఇష్టంతోనే చాకిరీలు
ఉరుకులు పరుగులు ఉద్యోగాలు ఊడిగాలు
ఎక్కువైతే ఇబ్బందే తక్కువైనా తగువే
అలవాటయిన భారం అలసటపైనే మమకారం
చిరునవ్వు మోముతో చమటోడ్చిన సమయం
చప్పదనం కనపడనివ్వని ఉప్పదనపు జీవనం

విభేదాలు వేదనలు కష్టాలతో కాపురాలు
రుగ్మతలు రోదనలు కన్నీళ్ళకు స్వాగతాలు
అడుగడుగూ యాతనయే పతనానికి ఎదురీతయే
వేదాంతయోగం వైరాగ్యకాలం
అంతర్మధనం అవలోకనం కారం కారం జీవనభారం

ఆజ్ఞాపకాల ప్రవాహాన్నాపుతూ దరిచేరిందొక సందడి
నా నోరు తెరిచి పోసారెవరో షడ్రుచుల పచ్చడి
ఇదేమిటి? ఆరు రుచులూ తెలియడం లేదేమిటి?
ఏ ఆర్భాటం ఆనందం దరిచేరని ఈ వృధ్ధాశ్రమంలో
నాలాంటి శుష్కించిన దేహాలు సంచరించు ఈ నిశ్శబ్ద నిశీధిలో
తెలిసేది ఒక్క రుచే..
చేదు..చేదు..చేదు మాత్రమే !

సరోగేట్ మదర్.. మరో గ్రేట్ మదర్!!














బీజం ఎవరిదో..ఫలం ఎవరికో..

అయినా..ఓ జీవి అంకురార్పణకు
సన్నధ్ధమవుతున్నావు నిశ్చయంగా..నిశ్చలంగా..

అండం నీది కాదు..పుట్టేది నీకోసం కాదు..
అయినా..నీ రక్తమాంసాలను ఆహారంగా ఇచ్చేందుకు
సంసిధ్ధమవుతున్నావు ఆర్తిగా..ఆనందంగా..

ప్రేమ ఎవరికో..వాత్సల్యం ఎవరిదో..
అయినా..నీ కణకణాన్నీ కరిగించి ఇచ్చేందుకు
పూనుకుంటున్నావు ప్రేమగా..పరవశంగా..

నీ ఒడి నిండదు..నీ కల పండదు..
అయినా..పెరుగుతున్న నీ ఉదరభారాన్ని
సంతోషంగా మోస్తూ ఉన్నావు
చిన్నారికదలికలకు మురుస్తూ ఉన్నావు
చిత్రంగా..చిద్విలాసంగా..

నీ బిడ్డ కాదు..నీ కళ్లెదుట పెరిగేది లేదు
అయినా..భూమిపై పడేందుకు నీ కడుపు చీల్చుకువచ్చే
ఆప్రాణాంతక క్షణాలను పంటిబిగువున భరిస్తూ ఉన్నావు
నిర్భయంగా..ధ్యేయంగా..

ఎవరి వారసుడో..తలకొరివి పెట్టేది ఎవరికో..
అయినా..మరణానికి సైతం నువు సిధ్ధపడి
ఆ పసికందుకి జన్మనిస్తున్నావు

నువుపడుతున్న నరకయాతన
ఒక స్త్రీమూర్తి ఒడి నింపాలన్న తపన

స్త్రీ జాతి సహనానికి సరియైన అర్ధంలా
ఆడజన్మ ఔన్నత్యానికి నిజమైన నిదర్శనంలా
హద్దేలేని త్యాగానికి మరో రూపంలా
ఓ ప్రతీకగా నువు నిలుస్తున్నావు
అందుకే..
సరోగ్రేట్ మదర్ అని పిలువబడుతున్న నీవు
మరో గ్రేట్ మదర్ వి !