మీరూ వస్తారా మాతో?


ఇదిగో ఇప్పుడే
చిన్నపిల్లనయిపోయా హఠాత్తుగా
కాదు ఎవరో మార్చేసారు
ఓ చిన్నపిల్లాడ్ని చూసాకే
ఇదంతా జరిగిందిలా
ఇక ఎప్పటికీ ఇలాగే
అవమన్నా అవనుగాక పెద్దదాన్ని
అసలెప్పటికీ వద్దు మాకీ
పెద్దరికాలు
మీరూ వస్తారా మాలోకంలోకి?

మీరూ వస్తే ..ఇక్కడ..
మాయలెరుగని అమాయకత్వాన్ని
తలా కాసింత పంచుకుందాం
ముసుగుల్లేని ముఖాలతో
ఒకర్నొకరు చూసుకు నవ్వుకుందాం
రండి మీరూ నేనూ అతనితో కలిసి
ఆడుకుందాం పాడుకుందాం
ఎప్పుడో మర్చిపోయిన
అమ్మప్రేమ తాయిలపు రుచిని
కలిసి కాకెంగిలి చేసుకు తిందాం
ఎన్నడో మరుగునపడిన
నాన్నకధల కొయ్యగుర్రమెక్కి
ఊరంతా తారంగం తిరిగొద్దాం
వీలైతే ఇంకా వెనక్కెళదాం

పతనమైన బాల్యపు గాలిపటాన్ని తీసి
ఎగరేసుకుందాం
కరిగిపోయిన కాలాన్ని వెనక్కి పిలిచి
తిరగేసుకుందాం
పసిదనపు ఇసుకగూళ్ళు మళ్ళీ
కట్టుకుందాం
పారిపోయిన జ్ఞాపకాలను వెతుక్కుని వెళ్ళీ
పట్టుకుందాం

0 comments:

Post a Comment