ఊహలరెక్కలు


నిజాలెలాగూ దూరం
కల అయినా దరికొస్తుందనుకున్నా

కలకోసం కాచుక్కూచుంటే
నిద్రకూడా రాలేదు
ఇద్దరూ కలిసి ఎక్కడికెళ్ళారో !

కలవస్తే నువ్వూ వస్తావనుకున్నా
ఆరెంటితో కలిసి
ముగ్గురూ ఓ జట్టయారన్నమాట!

కనురెప్పల నడిగా
మీజాడేమైనా తెలుసేమోనని
వాటికీ నామీద అలుకేమో రెపరెపలే తప్ప
పెదవివిప్పి పలికితేనా!

జామురేయినడిగా
ఇంతసేపైనా మీరురారేమని
నక్షత్రాలు తనతోడున్నాయని ధీమా
నామాటొక లెక్కా?

ఊయలలూగే మనసుకి ఇక ఒక్కరే దిక్కు
కళ్ళుమూసుకోగానే తెరుచుకునే
ఊహలరెక్కలు !

ఆరెక్కలమీదెక్కి అటూఇటూ తిరిగానా
ఓచోట నువ్వు కనపడ్డావు
ముసిముసినవ్వుల కొంటెచూపుతో!

నన్నొదిలి ఇంతదూరమెందుకెళ్ళావని
అడిగితే అలిగితే
ఈసారి నీది పకపక నవ్వు
'ఊరంతా తిరిగింది నువ్వు
నేనిక్కడే ఉన్నాగా' అని నువ్వంటుంటే
అప్పుడు చూసా నువ్వున్నచోటు నాదేనని
నా హృదయానిదని!

0 comments:

Post a Comment