అబ్బురాలు-అద్భుతాలు


 అబ్బురాలు-అద్భుతాలు

మౌనంగా పెరిగే మొక్కా
ముచ్చటగా వికసించే పువ్వూ
వెలుగుతూ ఎగిరే మిణుగురూ
గుంభనంగా గూడు కట్టే పక్షీ
మట్టిముద్ద దొర్లించుకెళ్లే పురుగూ
పలికే చిలకా పాడే కోయిలా
పండే చేనూ పండ్లిచ్చే చెట్టూ
అనునిత్యం గోచరించు అబ్బురాలు


విశాల వినీల ఆకాశం
గంభీరాకార మహాసాగరం
ఠంచనుగా వచ్చెళ్లిపోయే సూర్యచంద్రులూ
నిధులెన్నో దాచుకున్న నేలా
లేకుంటే ఏంటన్నది ఊహించలేని నిప్పూ నీరూ ఉప్పూ 
అన్నాదులను పండిచి ఇచ్చే మట్టీ
ప్రవహించే నీరూ పడిలేచే కెరటం
కదిలే మేఘం కురిసే వర్షం
అగుపిస్తూ అంతుచిక్కని అద్భుతాలు    

తెర


తెర

తెర లేచింది
సినిమా మొదలయ్యింది

ప్రేమ అనుబంధం
పంచుకోడాలూ పెంచుకోడాలూ
ఆహ్లాదభరితం
కొంతసేపు...


స్నేహం బంధుత్త్వం
కలవడాలూ కనుమరుగవడాలూ
సహజాతిసహజం 
మరికొంతసేపు..


అనుభవం అవగతం
పశ్చాత్తాపాలూ ప్రాయశ్చిత్తాలూ
అంతర్మధనం
ఇంకాస్తసేపు...


వేదంతం వైరాగ్యం
ఉపదేశాలూ ఉపశమనాలూ
ఆత్మావలోకనం
మిగిలున్నంతసేపు ...


సినిమా అయిపోయింది 
తెరపడింది!!

సహజానందం


సహజానందం

ఇంట్లో అంతా సినిమాకెళ్లారు
ఎప్పుడో తారలాడిన ఆటను
తెరమీద బొమ్మలుగా చూడ్డానికి.
ఇంట్లో ఎందుకని తోటలోకి మార్చా వాలుకుర్చీని.
 

పువ్వుపువ్వునీ ముచ్చటగా పలకరిస్తూ
రెక్కలను పొందిగ్గా కదిలిస్తూ 
నాట్యం చేసె సీతాకోకచిలకలూ

ఆ చెట్టుకు ఈ చెట్టుకు వంతెన వేస్తూ  
ఘుమ్మని రాగాలు తీస్తూ
ఆక్కడొక కాలూ ఇక్కడొక కాలూ  
వేస్తూ తిరిగే గండుతుమ్మెదలూ

అపుడపుడూ నిర్భయంగా పరిగెత్తుకొచ్చి వాలి
ఏదోటి ముక్కున దక్కించుకున్నాక
భయంగా తుర్రున పారిపోయే జంటపిట్టలూ

నాకు చూపించాయి ఓ అద్భుతమైన సినిమా
ఆహ్లాదకరమైన, సహజమైన సినిమా !

అందం



ఆమెకన్నూముక్కూ
అంగాంగం సొగసైనవి
పలువరసా మేనిచాయా నిగారైనవి
పెట్టెల్లోవీ సీసాల్లోవీ
ఆమె వంటిమీదకెక్కాయి
ముస్తాబదిరింది
అయినా..
ఆమె అనాకారే
ముఖాన మచ్చుకైనా
నవ్వులేదు మరి!


ఫ్రీ రిజర్వేషన్


ఆ బండిలో
అందరికీ బెర్తులు ఫ్రీనే
ముందే..మీరడక్కుండానే
రిజర్వు అయిపోతాయి
ఎవరికివారు చేసుకోనక్కరలేని
రిజర్వేషను ఇదొక్కటే
అప్పుడప్పుడు తత్కాల్ ఆఫర్
కూడా వుంటుంది
బెర్తులు బానే ఉంటాయండోయ్
ఎంచక్కా పూలుచల్లబడి
అత్తరు పూయబడి
అగరొత్తుల పరిమళమద్దబడి
ఆ మాత్రం సోకు ఉండొద్దూ
బండిపేరు
మరణం మరి!

అందని తీరం



తీరంలో నిలబడి నీవు
కనపడుతూనే ఉన్నావు
పయనం నీవైపే అయినా
ఎందుకో..
ఈదినకొద్దీ
పెరుగుతోంది
దూరం !
ఈదిఈది అలసిన మనసు
ఆలోచనలో పడింది
కారణమేమయి ఉంటుందని
స్థిమితపడి చూస్తే
తెలిసొచ్చింది
అత్యాశదని
లోపం! 

కవి

 

నీ
హృదయం మెత్తని పూవుల పరుపు 
ఊహలు వెచ్చని ఉదయపు వెలుగు 
నువు సున్నితమై, సృజనవై 
ఒక స్పందనవై, స్ఫూర్తివై 
నీలో కోటిభావాలు పల్లవించగా 
అనంతమైన ఆలోచనల 
జలధివై భావోజ్వలితవై 
భాసిల్లు 
ఉషోదయానివి ! 

నీ
కవితాకౌశలపు ధారలతో
తడారిన రససీమలను
తడుముతూ తడుపుతూ
దాహం చల్లారుస్తూ
హృదయం చెమ్మెక్కిస్తూ
నిరంతర ప్రావాహమై
కదలిపోవు
కావ్యఝరివి !

నీ
చూపు సాంఘిక సమస్యలవైపు
ఆలోచన బాధిత అన్నార్తుల కొరకు
నువు కసివై క్రోధానివై
ఒక ప్రయోజనమై పరిష్కారమై 
నీ మహామేధస్సు విస్తృతించగా 
కదంతొక్కు కవనతేజమై
ఉరకలేయు 
ఉద్యమానివి !

....కవివి !
!

నిరీక్షణ


ప్రియా!
ఇక్కడే ఉన్నా
నువ్వొదిలినచోటే
లోతెరుగని అగాధపు అడుగున
అంటిపెట్టుకునే కూర్చున్నా
కనీకనిపించని సూర్యుని వెలుగులో
నీ కదలిక నీడలు కనపడునేమోనని
వినీవినిపించని గాలిసవ్వడి తోడై
నీ అడుగుల అలికిడి వినపడునేమోనని
ఒడలంతా కనులై
మనసంతా నీవై  
ఎదురుతెన్నులే ఊపిరై 
వేచియున్నా.. చకోరినై.. 
ప్రేమకై..
నీకై !

నానోలు


స్త్రీశక్తి
మహావృక్షం
కట్టిపడేస్తే
బోన్సాయ్ -
  
కాలుష్యం
వైరస్
సుస్తీలో
భూగోళం-


భాష
కాదు
ఆలోచన
కవిత్త్వం-


అన్నదాత
పేరన్నా
గంజినీరు
కరువన్నా-
నోట్లేస్తే


ఓట్లపంట
సాగుచేస్తే
అవినీతిపంట-


ఎండమావి
జీవనయానం
చూస్తూనే
సాగించాలి-
  
ఎదుటనే
అన్నీ
ఎంచుకో
హంసలా-


గడిచినవి
అనుభవాలు
మరువనివి
జ్ఞాపకాలు-


ఆశయం
ఆకాశమంత
సాధన
సాగరమంత-


చదవడానికే
జీవితపుటలు
రాయలేము
చెరపలేము-


విశ్వాసం
బలం
పరిశ్రమ
ఫలం-


కలవకముందు
నువ్వెవరో
కలిసినాక
నేనెవరో-


చూపుకి
చెరువంత
దక్కేది
దోసెడంతే-

గోరుముద్దంత
అమ్మ
గోదారంత
ప్రేమ-
  
ప్రేమ
సంద్రమంతైతే
గుండె
వరదవదా?-


విద్య
ప్రేమ
పంచేద్దాం
పెరుగుతాయి-


ఆడబిడ్డ
అడ్డమా
వడ్లగింజ
ఆయుధమా?-


ఉప్పెన
దుఖం
ఆనకట్ట
ఓదార్పు-


ఎవరు
నువ్వు
అదే
ఆలోచిస్తున్నా-


నువ్వు
నేనే
తక్కిందంతా
శూన్యం-


మోహం
ఎంత?
మౌనం
ఆగనంత-


నిర్లక్ష్యం
విత్తనాలు
అవినీతి
మహావృక్షాలు-


చీడపురుగు
చెట్టుకీ
అవినీతిపరుడు
దేశానికీ-



శిఖరం
అగాధం
ప్రేమ
చిరునామాలు-



జీవితకాలం
వెదుకులాట
ఫలితం
నేను- 



నాకోసం
వెతికాను
నువ్వు
దొరికావు-



రోజు
ఒకపాఠం
జీవితకాలం
కోర్సు-



ఆమె
మహాకావ్యం
ఆఖరిపేజీ
అడ్రసేలేదు-


6
మాట
ఒక్కపలుకే
మౌనం
లెక్కలేనన్ని-


6
దుఖం
ఓపికపట్టొద్దూ
ఉల్లిపాయ
కోసేంతవరకూ-


7
నీరు
పల్లమెరుగు
నానో
నాణ్యమెరుగు-


8
ఏకాంతమూ
సుఖమే
మదినిండా
నీవుండగా-



ఆవేశం
ఆలోచన
పగలు
రేయి -



సూక్ష్మం
సునిశితం
సుభాషితం
నానో-



కామం
గదివరకు
ప్రేమ
తుదివరకు-
  
చిగురంత
దానం
తరువంత
ప్రయోజనం-


ఊహల ఊయల


మరులు రేపు హృదయడోలలు పెదవిదాట ఆగిపోవగ
హాయిగొలుపు గిలిగింతలు పైకి తెలుపక ఆగిపోవగ
ఈ మౌనమెంత బాగుందో!

ప్రేమపలుకుల తేనెరాగాలు క్షణమైనను మరువక తలపించగ
వలపుతలపుల సుస్వరనాదాలు ఒకటైనను వదలక వినిపించగ
ఈ నిశ్శబ్దమెంత బాగుందో!

ఊహలల్లిన ప్రణయసీమల ప్రతిక్షణమూ నాదవ్వగ
గుండెగుడిలో పదిలమైనీవు అనుక్షణమూ తోడుండగ 
ఈ ఏకాంతమెంత బాగుందో!

వృధా తపస్సు


కట్టుబాట్లు పాషాణాలై
నలిగిచచ్చిన ప్రేమ
మిగిలించింది 
శిలాజపు జ్ఞాపకం 
వెదికి పట్టుకున్నావు సరే,
ఏం చేసుకుంటావు?
పగిలిన గుండెకు
సాక్షిగా ఎండిన రక్తపు చారికలూ
ఇంకిన కండ్లకు 
తోడుగా చూపుకందని కోరికలూ
మోడువారిన వృక్షానివి
పచ్చని భ్రమల కొమ్మలు వేళ్లాడేసుకు
ఎంతసేపు నిలబడతావు?

కొయ్యగుఱ్రపు స్వారీ

 

దేశాభ్యుదయం ఆశిస్తున్నారా?
సభలూ సదస్సులూ
ప్రసంగాలూ ప్రబోధాలూ
ఎన్నిచేసి ఏంలాభం?
కొయ్యగుఱ్రపు స్వారీ!
ఇంచైనా కదలని ఆశయం
ఎక్కండి అసలైన అశ్వాన్ని
దూసుకెళ్లండి సమస్యల వనంలోకి
వెతికిపట్టండి పరిష్కార ఫలాల్ని 

భారతదేవికి వందనం




భారతదేవీ వందనం ఓ..
బంగరు భూమీ వందనం
ఏడు స్వరములు పాటగ మారగా
కోటి స్వరముల కీర్తనం        /భారత/


నీ శుభగానం పాడెదమూ
నిరతము నిన్నే కొలిచెదమూ
ప్రతి ఒక ఫౌరునీ మానసమందిరం
నిండెను మంగళమౌ నీ రూపం    /భారత/


కాలం వెనుకే పరుగెడుతూ
సతతము మాకై శ్రమపడుతూ
అలసిన సొలసిన నిను సేవించే
అమ్మా మాకొక వరమివ్వు         /భారత/

కలతల కాలం ముగిసింది
కమ్మని తరుణం ముందుంది
ప్రతి భారతీయుడూ కార్మిక యోధుడై
నిలుపును జగతిలో నీ ప్రగతి  /భారత/

మినీ కవితలు


( 1)
గుండె మొండిది
గుబులు ఉంచేసుకుంటుంది గుట్టుగా
మనసు మూగది
వేదన దాచేసుకుంటుంది తెలివిగా
కనులు బేలవి
బాధ బయటపెట్టేస్తాయి తడితడిగా


    (2)


నా గుండె 
ఇంకా కొట్టుకుంటూనే ఉంది
నువ్వక్కడే ఉన్నావనడానికి సాక్ష్యంగా


    (3)
తెలుసు ప్రేమ గెలిచినవాడికి
శిఖరం ఎత్తెంతో
ఓడినవాడికి
అగాధం లోతెంతో


    (4)
రెక్కలసాయంతో
విహంగయానం
ఆశల ఆసరాతో
మనిషి జీవనయానం


    (5)
పట్టుచీరకని అలిగె
గొప్పింటి గుమ్మ
పట్టెడన్నం కోసం నలిగె
గుడిసింటి అమ్మ


    (6)
చల్లనైన చందమామ
చల్లేది వెన్నెలే
పుట్టేవి మాత్రం
విరహాగ్ని జ్వాలలు


    (7)
భాషరాని మనసు
మూగదయ్యింది
చొరవకనుల సాయం
సాధ్యమయ్యింది


    (8)
మనిషి ఏకాకే
పశుపక్ష్యాదుల చెట్టుచేమల
సాహచర్యం లేకుంటే


    (9)
అనుభవాల నదుల్లోంచి
పొంగుకొస్తున్న సన్నని వాగు
ఉండుండీ ఉరికొచ్చే
జ్ఙాపకం!
అనుభూతుల పొదల్లోంచి
పొంచిచూస్తున్న పున్నమినాగు
అదనుచూసి కాటేసే
పచ్చినిజం!


    (10)
ఊరంతా గాలించినా
దొరకలేదు పువ్వులు
దర్శనమిచ్చాడు స్వామి
బోసినవ్వుతో
ఇంట్లోనే దొరికాయి
పసిపాపల నవ్వుల పువ్వులు
అర్చన జరిగింది వాటితోనే !







గుడిదేముడి కష్టాలు

గుళ్లో దేముడికెన్ని కష్టాలో..

ఒకరికంటె ఒకరు ముందంటూ
తోసుకుంటు తొక్కుకుంటు దూసుకెళ్లే
కిక్కిరిసిన భక్తజనసందోహంలో
కుక్కబడి, నొక్కబడి, నలపబడి
సమర్పించబడిన దుర్గంధపు పూమాలల
భారంతో ఊపిరాడక..

ఒకరికంటె ఒకరు ఎక్కువంటూ
వందలు వేలంటు వెలిగించి పేర్చిన
జ్యోతుల కాంతుల వేడి సెగలలో
హారతుల మంటల నల్లని పొగల
ధూపంతో చూపుకానక..

క్షణమైన గడువీయక టపటపమంటూ
సాగే తొక్కిసలాటల చిత్తడి చర్యలో
కొబ్బరి పగుళ్ల మోతలలో
మరుగునపడిన భక్తి సంకీర్తనల
మాధుర్యం చెవిన పడక...

ఆ స్వామి పడే పాట్లు ఎన్నని!

కానీ..ఆ స్వామి ప్రశాంతంగా ఉన్నాడొక చోట
నిర్మలమైన మనస్సుమాలతో అలంకరించబడుతూ
నిశ్చలమైన బుధ్ది జ్యోతితో దర్శించబడుతూ
నిశ్శబ్దమైన హృదయ గానంతో కీర్తించబడుతూ

నిజమైన భక్తుని గుండె గుడిలో!

నానోలు

మనసు
మనిషంత
వయసు
వసంతమంత


గోరుముద్దంత
అమ్మ
గోదారంత
ప్రే


మతాలెన్నైతే
నాకెందుకు
మనుషులేగా
అన్నింటా!


ప్రేమ
సంద్రమంతైతే
గుండె
వరదవదా?


కష్టసుఖాలు
ఒక్కచోటే
గులాబి,
ముళ్లులా


విద్య
ప్రేమ
పంచేద్దాం
పెరుగుతాయి


కలయిక
మధురం
ఎడబాటు
దుర్భరం


ఆడబిడ్డ
అడ్డమా?
వడ్లగింజ
ఆయుధమా?


ఉప్పెన
దుఃఖం
ఆనకట్ట
ఓదార్పు














ఎవరు
నువ్వు?
అదే
ఆలోచిస్తున్నా!

అద్భుత నిధి

( మినీ కవిత)


మానవ మస్తిష్కం
మహా సముద్రం
మంచిముత్యాలూ
మణి మాణిక్యాలూ
వెతికి ఏరి
పోగుచేసుకోవడమే
మనిషి పని !


బుల్లి మేధావులు

తెలివంటే నాదే కదా!
అని మురిసిపోతుంటా గానీ
'అది నీ సొత్తేం కాదు' అని
నాకు గుర్తుచేసినట్లుంది వీటి
తెలివికి బలయినప్పుడల్లా..

ఏం చెప్పను చీమెంతటిదో!
ఏదైనా ఇలా పెట్టి అలా వెళ్లొచ్చే లోపల
కంటికైన కనపడనిచోటికెక్కడికో
మోసుకెళ్లి గుట్టుగా దాచేసుకుంటోంది

దోమెంత తెలివైందని!
లైటార్పి గుడ్ నైట్ అనే లోపల
జుయ్యిమని ఎగిరొచ్చి చటుక్కున
గిచ్చేసి గమ్మత్తుగ మాయమయిపోతోంది

నల్లిమాత్రం తక్కువ తిందా!
ఏమూల నుంటుందో ఇలా కూర్చోగానే
గబగబ బయిటికొచ్చి చిటుక్కున
కుట్టేసి చల్లగా దాక్కుండిపోతోంది

పేను సంగతి చెప్పాలా!
లేనట్టే ఉంటుందిగానీ ఉండుండి ఒకసారి
జరజర పాకొచ్చి కసిక్కున
కొరికేసి గమ్ముగ ఊరకుండిపోతోంది

ఇలా రోజూ..
చిన్నవేకదా అనుకుంటూనే
చీటికీ మాటికీ వీటిచే
మోసగించబడుతున్నాను
నా తెలివి తెల్లారినట్ట్లే ఇక!

ఆదర్శం

నేను నువ్వు కాగలనా?
నీలా నేనెప్పటికైనా మారగలనా?

కిలకిల మని నవ్వేస్తూ ఉంటావు
కరడుగట్టే దుఃఖాన్నైనా
కనులచాటున దాచేస్తూ..

పులకరముగ పలుకరిస్తుంటావు
ఎదను కాల్చే వ్యధలనైనా
హృదయగోడల కదిమేస్తూ..

గలగలమని మాట్లాడేస్తుంటావు
గుండెలవిసే బాధనైనా
గుటకలేసి మింగేస్తూ..

అలా నేను అవగలనా?
నీలా నేనెప్పటికైనా మారగలనా?

స్వేచ్ఛాపయనం

ఎగిరే గాలిపటం
నీ జీవనపయనం
గాలి ఎటు వీస్తే
అటు సాగుతోంది
ఏ గాలీ లేనప్పుడు చతికిలబడుతోంది
తాకిడెక్కువైనప్పుడు విలవిల్లాడుతోంది
ఇంతేనా నీ జీవితం?
ఎవరో ఎగరేసే గాలిపటంలా కాక
నీక్కావలసిన దిశను నువ్వే నిర్దారించుకోలేవా?
నువు చేరాల్సిన గమ్యాన్ని నేవే నిశ్చయించుకోలేవా?
నీకనువైన గమనాన్ని నీవే నిర్దేశించుకోలేవా?
ఇప్పటికైనా మేలుకో
దిశలేని గతిలేని పయనాన్ని మార్చుకో
ఓ స్వేచ్ఛావిహంగంలా విహరించడం నేర్చుకో

నాన్నెప్పుడూ నాతోడే
































లోకంలోని నాన్నలంతా ఒకెత్తు
నాకు మా నాన్నొక్కరే ఒకెత్తు 

ఈ అక్షరాలు నాకాయనిచ్చినవి
నా లక్షణాలు ఆయన్నించొచ్చినవి
సుతిమెత్తిని హృదయమాతని సొంతం
చీమకైనా ఎలాంటి హానీ చేయలేరు

మృదువైన భాషణ అతనికాభరణ
పొరపాటునైన పరుషములాడెరుగరు

సూక్ష్మమైన జ్ఙానమాతని సొత్తు
విషయమేదైనా విడమర్చి చెప్పగలరు

మంచులాంటి మనసాతని ఆస్తి
కలనైనా కష్టమెవరికి కలగనీరు

నా ఉత్సాహానికి ప్రోత్సాహమై
నా ప్రతిభలకు పునాదై
నా ప్రతిపనికీ ప్రేరణయై
నా అశయాలకు ఆలంబనై
అన్నిటా తోడై నడిపించారు

కనిపించని లోకాలనున్నా
నాక్కనిపిస్తూనే ఉన్నారు
నా ఆలోచనలలో నిండి.
ఆచరణలలో నాతోడుండి
అప్పుడూ..ఇప్పుడూ..ఎప్పుడూ

నాతోడే మా నాన్నెప్పుడూ !

పుత్రోత్సాహం?



చూడవే మనబాబు ఎంత ముద్దొస్తున్నాడో
ఒకటే ఆనందం పసికందుని చూస్తూ
వీడెంత స్పష్టంగా మాట్లాడుతున్నాడో చూసావూ?
అత్తా..తాతా..తొలిపలుకులే వేదాల్లా వినపడినప్పుడు

అరె, నా దిష్టే తగిలేలా ఉందే
తోటిపిల్లల్తో పోలిస్తే మావాడే అందంగా ఉన్నాడు
మా వాడికి బ్రహ్మాండమైన రాంకు వచ్చింది
తొణికిసలాడే గర్వంతో ఆఫీసులో స్వీట్లు పంచిపెడుతూ


ఎంత ఠీవి, ఏమి దర్జా, మగవాడంటే ఇతడే కదా!
పట్టలేని సంతోషం అతన్ని ఉద్యోగస్తుడిగా చూస్తూ
మనవాడు పెళ్లికొడుకుగా ఎంత బాగున్నాడో కదూ!
ఇంత ముచ్చటగా మునుపెవర్నైనా చూసామా?

నా కన్నతండ్రి ఇద్దరు పిల్లలకు తండ్రయాడా?
ఎంత హుందాగా ఉన్నాడు నాన్న హోదాలో!
ఇంత అందమైన ఇల్లు ఈ దరిదాపుల్లో ఉందా?
మనవాడు కాబట్టి ఇంత గొప్పగా కట్టించగలిగాడు

ఒకటేమిటి? అడుగడుగునా ఆనందమే
ప్రతిరోజూ వాణ్ణి చూసి నాకు సంబరమే
మొన్నటివరకూ!

ఇప్పుడు మురిసిపోవడానికి ఇక్కడ ఏమీ లేదు
నాతో కలిసి నెమరేసుకోడానికి ఆమె కూడా లేదు
ఈ ఆశ్రమంలో నా చుట్టూ నాలాంటి నాన్నలే
వాళ్ల కొడుకులూ మావాడిలాగే
అమెరికాలోనో..ఆస్ట్రేలియాలోనో..

మంట


చింపిరి జుట్టూ చీమిడి ముక్కూ
చినిగిన గుడ్డా చిక్కిన పొట్టా
ఇదే అవతారం..ఊహ తెలిసినప్పట్నించీ
ఇవేవీ బాధించవు వాడిని.. 


కళ్లల్లో నీరసం కడుపులో నకనకా 
చేతిలో కొరడా ఛాతిపై చురచురా
ఇదే వ్యవహారం..కాస్త నడకొచ్చినప్పట్నించీ
అదేమీ మంటనిపించదు వాడికి..


మిట్టమద్యాహ్నం..
కాలికి బూటున్నా, నెత్తికి టోపీఉన్నా
ఉస్సురుస్సురని ఆపసోపాలుపడే
జనప్రవాహం..


అప్పుడప్పుడూ చిరాగ్గా చూసే చూపూ
అడపాదడపా పరాగ్గా విసిరే కాసూ
ఉండుండి కోపంగా అదిలించే పోలీసూ
పక్కనే గుక్కపెట్టి ఏడ్చే తమ్ముడూ
ఇవేమీ అసలు పట్టవు వాడికి..


ఎంత కొట్టుకుంటే అంత జాలి
చర్మమెంత కందితే అంత సొమ్ము


కడుపులోని ఆకలి మంట కంటే  
వంటిపైని కొరడా దెబ్బల కంటే  
ఎక్కువ మంట పుట్టేది వాడి గుండెలో! 
తను ఖాళీ బొచ్చెతో ఇంటికెళితే
నాన్నకాలితో తన్నులు తినే అమ్మ
దీనమైన చూపుల్ని చూసినపుడు!   

అన్నీ జ్ఙాపకమే

అన్నీ జ్ఙాపకమే...ప్రియా!

నా నడకల కదలికల చిరు సవ్వడులు
నీ చెవిని సన్నగా చేరినప్పుడు
ఎక్కడనీవెక్కడని నాకై నీ కన్నులు పరికించడం..

నా హృదయ స్పందనల తరంగ వీచికలు
నీ మదిని మెత్తగా తాకినప్పుడు
గుండెచప్పుడాపి పరిపరి నీ మనసు పరితపించడం..

నా తొలితొలి వలపుల తొలకరి జల్లులు
నీ మోవిపై చల్లగా కురిసినప్పుడు
సమ్మోహితమై తడిసిన నీ పెదవులు కంపించడం..

నా మల్లియ సొగసుల పరిమళ గంధాలు
నీ ఎడదపై మృదువుగా పూసినప్పుడు
పరవశభరితమై తన్మయ నీ తనువు పులకించడం..

అన్నీ..నాకింకా జ్ఙాపకమే
!

తిరిగిరాని ప్రయాణం


కాలం సాగిపోతోంది
కాదు కాదు పరిగెడుతోంది
రైలు బండి స్పీడులో దూసుకెళుతోంది
ఎక్కడికి ప్రయాణం? ఏమో!
గమ్యం తెలీని ప్రయాణం

వెనక్కి వెళ్తున్నవేమీ మళ్లీ రావా?
అలక్ష్యంతో అందుకోని ఆత్మీయులు
వెనక్కి వెళ్లిపోయిన దృశ్యాల్లా
నిర్లక్ష్యంతో వదిలేసిన బంధాలు
మళ్లీ తిరిగిరాని స్టేషన్లలా..
అనిపిస్తున్నాయి ఇప్పుడు

గమ్యం చేరాక తిరిగి ఇంకోసారి
ఈ బండి వెనక్కి వెళితే బాగుణ్ణు
ఈసారి శ్రధ్ధగా.. బుధ్ధిగా..
జాగ్రత్తగా..జాగరూకతగా
ఇష్టంగా..అర్ధవంతంగా..
వళ్లు దగ్గరపెట్టుకుని కళ్లింత చేసుకుని
ప్రయాణం మళ్లీ మొదలెడతా
!

కల-జీవితం

ఎడ తెరిపి లేని ప్రయాణం..
ఆసాంతం వీక్షిస్తూ..విహరిస్తూ..
ఒక్క క్శణం నిరాశ..

అగాధాల అంచున పయనిస్తూ
ఎక్కడో చీకటి పాతాళంలోకి పడిపోతూ
మళ్లీ లేచి పైపైకి ఎగురుతూ
పడుతూ.. లేస్తూ..
మరుక్షణం ఏదో ఆశ..

ప్రపంచమంతా వర్ణమయంగా
మెరుస్తూ.. గుభాళిస్తూ..
ఆనందడోలికల ఊరేగుతూ
ఎన్నెన్నో అనుభూతుల తేలియాడుతూ

అంతలోనే..ఆగిపోయింది
నిశీధి నిద్ర ముగిసిపోయింది
కల్లల కల మాయమయ్యింది
కల చెదిరి ఉదయమయ్యింది
జీవితం ముగిసి మరణమొచ్చింది

ఇదీ పరిస్థితి !

దొరగారు....
తాగి తాగీ తాగలేక వదిలేసి వంపేసిన
తిని తినీ తినలేక కక్కేసి జల్లేసిన
ఒకరోజు తిండి విలువ ఎంతో తెలుసా?
తాగ గంజి లేక పేగులంటుకుపోయిన
వెయ్యిమంది అన్నార్తుల డొక్కలు తడపగలిగినంత!

దొరమ్మగారు...
ఒకట్రెండ్రోజులకే మొహం మొత్తేసి వదిలేసిన
ముట్టకుండా వాడకుండా చెత్తబుట్ట పాల్జేసిన
సౌందర్య సాధనాల ఖరీదెంతో తెలుసా?
పగలూ రేయీ ఇంటా బయటా చాకిరీ చేసినా
బిడ్డలకు పట్టెడన్నం పెట్టలేని దరిద్రాన్ని మోస్తున్న
వందమంది మాతృమూర్తుల శోకాన్ని చల్లార్చగలిగినంత!

చిన్న దొరగారు...
వినకపోయినా మోగే స్టీరియో
చూడకపోయినా వాగే వీడియో
కరెంటు ఖర్చు నెలకెంతో తెలుసా?
కాఫీ కప్పులు కడిగే కుళ్లు నీళ్లల్లో కొట్టుకుపోయే
కాలిబూట్లు తుడిచే దుమ్ము ధూళిలో ఎగిరిపోయే
పదిమంది నిరుపేద బాలమేధస్సుల ఆశ తీర్చగలిగినంత!

'నాకు నచ్చిన వ్యక్తులు' లో నా రెండవ చిత్రం


అవినీతిపై కార్టూన్లు


మనసు కుసుమం


















జీవనవని లో పూచిన
చిన్ని కుసుమమీ మనసు


పూలూ ముళ్లెన్నో
స్నేహహస్తం చాచినా
రంగులూ రాళ్లెన్నో
రారమ్మని పిలిచినా
తుషార మోవియై
చిద్విలాసమే సమాధానమై
జాగృతయై నిలుచునే
గానీ జారిపోదు


ఋతువులెన్నొ మారినా
వసంతమిచ్చిన
అనుభవాల కధలెన్నొ
కదలాడి కదిల్చినా
కాలమెంత గడిచినా
కనుమరుగవని
జ్ఙాపకాల వ్యధలెన్నొ
వెంటాడి వేధించినా
ధృఢమై విరియునే
గానీ జడం కాదు


వంటి నిండా కళ్లుఐ
కంటి నిండా మెరుపై
స్వామి సన్నిధి లక్ష్యమై
పరవశంతొ పరిమళించు
ఆశలవనిలో పూచిన
చిన్ని కుసుమమీ మనసు

నాకు నచ్చిన వ్యక్తులు




అవినీతి నిర్మూలన లక్ష్యంగాజన్ లోక్ పాల్ ధ్యేయంగా
మెరుపులా కదలిపోతున్న హజారే !
మేమంతా కలిసినడుస్తాం నీవెనుకే !


దేశాన్ని
అవినీతి
చెరనుంచి
విడిపించడానికి
కదలివచ్చిన
అన్నా హజారేకి
నమస్కారములతో..
అంకితం !

దేశద్రోహులు

ఎవరికి ఓటేశావ్?
మనసున్న మంచివాడికా?
కాదు...కాదు...
చదువున్న సంస్కారికా?
అదేం కాదు...
బాధ్యతున్న దేశభక్తుడికా?
అస్సలు కాదు...
సంఘమంటే అతనికవగాహన ఉందా?
ఏమో తెలీదు...
దేశాబ్యుదయమే అతని ఆశయమా?
కాదనుకుంటా...

మరి..ఏం తెలిసి అతనికోటేశావ్?
ఏంకోరి దేశాన్నతని చేతిలో పెట్టావ్?
అదేమీ ఆలోచించలేదా?

అవగాహనలేని, బాధ్యత లేని
తెలివిమాలిన... ఓటరువి నువ్వు!
నోట్లు పంచి ఓట్లు దండే దమ్మున్న
తెలివిమీరిన... నాయకుడు అతను!
అందుకే..ఇద్దరూ దేశద్రోహులే!!

....ప్రేమ....

స్వఛ్ఛమైన నది ప్రేమ
ఏ మలినం అంటనిది!


శ్రేష్ఠమైన తరువు ప్రేమ
ఏ స్వార్ధం కోరనిది!


విస్తృతమైన వెన్నెల... ప్రేమ
ఏ తాపములెరుగనిది !

ఉధృతమైన సంద్రం... ప్రేమ
ఏ ధాటికి చెదరనిది!

అద్భుతమైన నిధి... ప్రేమ
ఏ చోరులకగుపడనిది !

అందమైన పాపాయి... ప్రేమ
ఏ మాయలు తెలియనిది !

అనంతమైన విశ్వం... ప్రేమ
ఏ శోధనకందనిది !!