పుత్రోత్సాహం?



చూడవే మనబాబు ఎంత ముద్దొస్తున్నాడో
ఒకటే ఆనందం పసికందుని చూస్తూ
వీడెంత స్పష్టంగా మాట్లాడుతున్నాడో చూసావూ?
అత్తా..తాతా..తొలిపలుకులే వేదాల్లా వినపడినప్పుడు

అరె, నా దిష్టే తగిలేలా ఉందే
తోటిపిల్లల్తో పోలిస్తే మావాడే అందంగా ఉన్నాడు
మా వాడికి బ్రహ్మాండమైన రాంకు వచ్చింది
తొణికిసలాడే గర్వంతో ఆఫీసులో స్వీట్లు పంచిపెడుతూ


ఎంత ఠీవి, ఏమి దర్జా, మగవాడంటే ఇతడే కదా!
పట్టలేని సంతోషం అతన్ని ఉద్యోగస్తుడిగా చూస్తూ
మనవాడు పెళ్లికొడుకుగా ఎంత బాగున్నాడో కదూ!
ఇంత ముచ్చటగా మునుపెవర్నైనా చూసామా?

నా కన్నతండ్రి ఇద్దరు పిల్లలకు తండ్రయాడా?
ఎంత హుందాగా ఉన్నాడు నాన్న హోదాలో!
ఇంత అందమైన ఇల్లు ఈ దరిదాపుల్లో ఉందా?
మనవాడు కాబట్టి ఇంత గొప్పగా కట్టించగలిగాడు

ఒకటేమిటి? అడుగడుగునా ఆనందమే
ప్రతిరోజూ వాణ్ణి చూసి నాకు సంబరమే
మొన్నటివరకూ!

ఇప్పుడు మురిసిపోవడానికి ఇక్కడ ఏమీ లేదు
నాతో కలిసి నెమరేసుకోడానికి ఆమె కూడా లేదు
ఈ ఆశ్రమంలో నా చుట్టూ నాలాంటి నాన్నలే
వాళ్ల కొడుకులూ మావాడిలాగే
అమెరికాలోనో..ఆస్ట్రేలియాలోనో..

0 comments:

Post a Comment