చింపిరి జుట్టూ చీమిడి ముక్కూ
చినిగిన గుడ్డా చిక్కిన పొట్టా
ఇదే అవతారం..ఊహ తెలిసినప్పట్నించీ
ఇవేవీ బాధించవు వాడిని..
కళ్లల్లో నీరసం కడుపులో నకనకా
చేతిలో కొరడా ఛాతిపై చురచురా
ఇదే వ్యవహారం..కాస్త నడకొచ్చినప్పట్నించీ
అదేమీ మంటనిపించదు వాడికి..
మిట్టమద్యాహ్నం..
కాలికి బూటున్నా, నెత్తికి టోపీఉన్నా
ఉస్సురుస్సురని ఆపసోపాలుపడే
జనప్రవాహం..
అప్పుడప్పుడూ చిరాగ్గా చూసే చూపూ
అడపాదడపా పరాగ్గా విసిరే కాసూ
ఉండుండి కోపంగా అదిలించే పోలీసూ
పక్కనే గుక్కపెట్టి ఏడ్చే తమ్ముడూ
ఇవేమీ అసలు పట్టవు వాడికి..
ఎంత కొట్టుకుంటే అంత జాలి
చర్మమెంత కందితే అంత సొమ్ము
కడుపులోని ఆకలి మంట కంటే
వంటిపైని కొరడా దెబ్బల కంటే
ఎక్కువ మంట పుట్టేది వాడి గుండెలో!
తను ఖాళీ బొచ్చెతో ఇంటికెళితే
నాన్నకాలితో తన్నులు తినే అమ్మ
దీనమైన చూపుల్ని చూసినపుడు!
2 comments:
చదివే వాడికి ఆలోచించడమనే పనిని తప్పనిసరి చేసేది కవిత్వం.... ఇందులో మీరు కృతకృత్యులు అయ్యారు.... మీకు అభినందనలు.
చాలా బాగారాసారు ధన్యవాదాలు.
-సత్య
చాలా సంతోషం సత్యా!
Post a Comment