ఇదీ పరిస్థితి !

దొరగారు....
తాగి తాగీ తాగలేక వదిలేసి వంపేసిన
తిని తినీ తినలేక కక్కేసి జల్లేసిన
ఒకరోజు తిండి విలువ ఎంతో తెలుసా?
తాగ గంజి లేక పేగులంటుకుపోయిన
వెయ్యిమంది అన్నార్తుల డొక్కలు తడపగలిగినంత!

దొరమ్మగారు...
ఒకట్రెండ్రోజులకే మొహం మొత్తేసి వదిలేసిన
ముట్టకుండా వాడకుండా చెత్తబుట్ట పాల్జేసిన
సౌందర్య సాధనాల ఖరీదెంతో తెలుసా?
పగలూ రేయీ ఇంటా బయటా చాకిరీ చేసినా
బిడ్డలకు పట్టెడన్నం పెట్టలేని దరిద్రాన్ని మోస్తున్న
వందమంది మాతృమూర్తుల శోకాన్ని చల్లార్చగలిగినంత!

చిన్న దొరగారు...
వినకపోయినా మోగే స్టీరియో
చూడకపోయినా వాగే వీడియో
కరెంటు ఖర్చు నెలకెంతో తెలుసా?
కాఫీ కప్పులు కడిగే కుళ్లు నీళ్లల్లో కొట్టుకుపోయే
కాలిబూట్లు తుడిచే దుమ్ము ధూళిలో ఎగిరిపోయే
పదిమంది నిరుపేద బాలమేధస్సుల ఆశ తీర్చగలిగినంత!

2 comments:

జైభారత్

ఇదీ పరస్థితి చాల బావుందండి.. కార్టున్స్ ఇంకాస్త చురుక్కుమనాలి...బెస్ట్ ఆఫ్ లక్ జ్యోతిగారు..

జ్యోతిర్మయి ప్రభాకర్

కవితపై మీ అభిప్రాయానికీ, కార్టూన్ పై మీ సూచనకీ ధన్యవాదాలు లోక్ నాధ్ గారు

Post a Comment