బుల్లి మేధావులు

తెలివంటే నాదే కదా!
అని మురిసిపోతుంటా గానీ
'అది నీ సొత్తేం కాదు' అని
నాకు గుర్తుచేసినట్లుంది వీటి
తెలివికి బలయినప్పుడల్లా..

ఏం చెప్పను చీమెంతటిదో!
ఏదైనా ఇలా పెట్టి అలా వెళ్లొచ్చే లోపల
కంటికైన కనపడనిచోటికెక్కడికో
మోసుకెళ్లి గుట్టుగా దాచేసుకుంటోంది

దోమెంత తెలివైందని!
లైటార్పి గుడ్ నైట్ అనే లోపల
జుయ్యిమని ఎగిరొచ్చి చటుక్కున
గిచ్చేసి గమ్మత్తుగ మాయమయిపోతోంది

నల్లిమాత్రం తక్కువ తిందా!
ఏమూల నుంటుందో ఇలా కూర్చోగానే
గబగబ బయిటికొచ్చి చిటుక్కున
కుట్టేసి చల్లగా దాక్కుండిపోతోంది

పేను సంగతి చెప్పాలా!
లేనట్టే ఉంటుందిగానీ ఉండుండి ఒకసారి
జరజర పాకొచ్చి కసిక్కున
కొరికేసి గమ్ముగ ఊరకుండిపోతోంది

ఇలా రోజూ..
చిన్నవేకదా అనుకుంటూనే
చీటికీ మాటికీ వీటిచే
మోసగించబడుతున్నాను
నా తెలివి తెల్లారినట్ట్లే ఇక!

0 comments:

Post a Comment