అన్నీ జ్ఙాపకమే

అన్నీ జ్ఙాపకమే...ప్రియా!

నా నడకల కదలికల చిరు సవ్వడులు
నీ చెవిని సన్నగా చేరినప్పుడు
ఎక్కడనీవెక్కడని నాకై నీ కన్నులు పరికించడం..

నా హృదయ స్పందనల తరంగ వీచికలు
నీ మదిని మెత్తగా తాకినప్పుడు
గుండెచప్పుడాపి పరిపరి నీ మనసు పరితపించడం..

నా తొలితొలి వలపుల తొలకరి జల్లులు
నీ మోవిపై చల్లగా కురిసినప్పుడు
సమ్మోహితమై తడిసిన నీ పెదవులు కంపించడం..

నా మల్లియ సొగసుల పరిమళ గంధాలు
నీ ఎడదపై మృదువుగా పూసినప్పుడు
పరవశభరితమై తన్మయ నీ తనువు పులకించడం..

అన్నీ..నాకింకా జ్ఙాపకమే
!

తిరిగిరాని ప్రయాణం


కాలం సాగిపోతోంది
కాదు కాదు పరిగెడుతోంది
రైలు బండి స్పీడులో దూసుకెళుతోంది
ఎక్కడికి ప్రయాణం? ఏమో!
గమ్యం తెలీని ప్రయాణం

వెనక్కి వెళ్తున్నవేమీ మళ్లీ రావా?
అలక్ష్యంతో అందుకోని ఆత్మీయులు
వెనక్కి వెళ్లిపోయిన దృశ్యాల్లా
నిర్లక్ష్యంతో వదిలేసిన బంధాలు
మళ్లీ తిరిగిరాని స్టేషన్లలా..
అనిపిస్తున్నాయి ఇప్పుడు

గమ్యం చేరాక తిరిగి ఇంకోసారి
ఈ బండి వెనక్కి వెళితే బాగుణ్ణు
ఈసారి శ్రధ్ధగా.. బుధ్ధిగా..
జాగ్రత్తగా..జాగరూకతగా
ఇష్టంగా..అర్ధవంతంగా..
వళ్లు దగ్గరపెట్టుకుని కళ్లింత చేసుకుని
ప్రయాణం మళ్లీ మొదలెడతా
!