తాజా సందడి
____________

టప..టప..టప..టప..
సందేహంగా బయటికి చూస్తే
వచ్చేశామొచ్చేశామంటూ
వడివడిగా వస్తూ కనిపించాయి
వానచినుకులు..

నిజమా కలా అనుకునేలోగా
మట్టివాసనా మల్లెవాసనా కలగలిపి
మోసుకొచ్చి తాకాయి మోవిని
చల్లగాలులు..

ఎగిరిగంతేసి తెరకాస్త తొలగించి చూస్తే
ఉన్నచోటే ఉండి గాలి వేసే తాళానికి
పరవశం తో నాట్యంచేస్తూ కనిపించాయి
పెరటిమొక్కలు..

తడిసి ముద్దవుతున్నా లెక్కలేదు వాటికి
ఇన్నాళ్ళూ గదివదిలి రాలేని
నిస్సహాయతకి స్వస్తి చెప్పి
ఇక నీపనిలేదని స్విచ్చాఫ్ చెయ్యగానే
'అంతేలే' అని నీల్గుతూ ముడుచుకున్నాయి
ఏసీ రెక్కలు..

గదిలోంచి బాల్కనీలోకొచ్చిచూస్తే
నెలరోజులుగా మూతపడ్డ నోర్లు విప్పి
గానకచేరీ చేస్తూ కనిపించాయి
గువ్వపిట్టలు..

మెల్లమెల్లగా అయిందది జుగల్బందీ
కిచ..కిచ..కిచ..కిచ..
కూ..కూ..కూ..కూ..
పుయ్..పుయ్..పుయ్..పుయ్..

తలొక్కసారి పైకెత్తిచూస్తే
ముసిముసినవ్వులు చిందిస్తూ
మెరుపు రేఖలనంకరించుకుంటూ
ఉరుము భేరిగ సందడిచేస్తూ
గడిచిందొక వేడి పీడకలయన్నట్లు
ఆనందబాష్పాలు కురిపిస్తున్నట్లనిపించాయి
నీలిమేఘాలు..
ప్రేమంటే?

ప్రేమంటే ఏంటో
నాకైతే ఏం తెలియదు
తొలిసారి అతన్నిచూసినపుడు
ఒంటిలోని అణువులన్నీ
కదలడం మర్చిపోయాయి ఒక్క గుండెతప్ప
అక్కడ నా హృదయం దేన్నో స్రవించింది
బహుశా దేనికో ప్రసవం జరిగింది
మరి అదేంటో నాకైతే ఏమీ తెలియదు!

కళ్ళునాలుగు కలిసినపుడూ
తలపు మదిలో కదిలినపుడూ
గొంతు గుండెను తాకినపుడూ
అలా అపుడపుడూ..ఎప్పుడూ..
శ్వాసతో పాటూ ఇంకో చర్యేదో జరుగుతోంది
రక్తంతో పాటూ ఇంకోటేదో ప్రసరిస్తోంది
ఏమవుతుందో ఏమో
నాకైతే ఏమీ తెలియదు 

నాచేతిని ఒకచేత బంధించి
ఎదపై వాలినతలనొకచేత స్పృశించి
తమకపు కన్నుల సాక్షిగా నుదుటిని చుంబించి
అతడువేసిన విశ్వాసముద్ర
మనసున పలికించిందొక రాగం
బ్రతుకున కలిగించిందొక యోగం
ఏం మాయో అది
నాకైతే ఏమీ తెలియదు

ఇష్టాలూ కోరికలూ తాత్కాలికం
కలవడం విడిపోవడం యాదృశ్చికం
ఇవీ లోకుల నిర్వచనాలు
కానీ నాకనుభవమైంది ఇంకోలా
ఇష్టమంటే  చివరిశ్వాసను అంటిపెట్టుకోవడం
విడిపోవడమంటే గుండెవిరిగి శరీరం నుండి వేరవడం
మరి ఎందుకో
నాకైతే ఏమీ తెలియదు

గడ్డకట్టిన అనుభూతుల పొరల్లోకి 
ఏస్మృతో చొచ్చుకుపోయి చీల్చినపుడు
దొర్లేవి జ్ఞాపకాల దొంతరలే అయినా
పొంగిపొర్లేవి కన్నీటి ప్రవాహాలు
వరదపాలయిన హృదయం..
బద్దలవుతుందనుకునేలోపల ఏశక్తో
లాగి నన్ను బయటపడేస్తోంది
అంతమవుదామనుకునేలోపల ఏ ఆశో
మళ్ళీ నన్ను బతికిస్తోంది
ఆ ఆశకు పేరేంటో
నాకైతే ఏమీ తెలియదు