ప్రేమంటే?

ప్రేమంటే ఏంటో
నాకైతే ఏం తెలియదు
తొలిసారి అతన్నిచూసినపుడు
ఒంటిలోని అణువులన్నీ
కదలడం మర్చిపోయాయి ఒక్క గుండెతప్ప
అక్కడ నా హృదయం దేన్నో స్రవించింది
బహుశా దేనికో ప్రసవం జరిగింది
మరి అదేంటో నాకైతే ఏమీ తెలియదు!

కళ్ళునాలుగు కలిసినపుడూ
తలపు మదిలో కదిలినపుడూ
గొంతు గుండెను తాకినపుడూ
అలా అపుడపుడూ..ఎప్పుడూ..
శ్వాసతో పాటూ ఇంకో చర్యేదో జరుగుతోంది
రక్తంతో పాటూ ఇంకోటేదో ప్రసరిస్తోంది
ఏమవుతుందో ఏమో
నాకైతే ఏమీ తెలియదు 

నాచేతిని ఒకచేత బంధించి
ఎదపై వాలినతలనొకచేత స్పృశించి
తమకపు కన్నుల సాక్షిగా నుదుటిని చుంబించి
అతడువేసిన విశ్వాసముద్ర
మనసున పలికించిందొక రాగం
బ్రతుకున కలిగించిందొక యోగం
ఏం మాయో అది
నాకైతే ఏమీ తెలియదు

ఇష్టాలూ కోరికలూ తాత్కాలికం
కలవడం విడిపోవడం యాదృశ్చికం
ఇవీ లోకుల నిర్వచనాలు
కానీ నాకనుభవమైంది ఇంకోలా
ఇష్టమంటే  చివరిశ్వాసను అంటిపెట్టుకోవడం
విడిపోవడమంటే గుండెవిరిగి శరీరం నుండి వేరవడం
మరి ఎందుకో
నాకైతే ఏమీ తెలియదు

గడ్డకట్టిన అనుభూతుల పొరల్లోకి 
ఏస్మృతో చొచ్చుకుపోయి చీల్చినపుడు
దొర్లేవి జ్ఞాపకాల దొంతరలే అయినా
పొంగిపొర్లేవి కన్నీటి ప్రవాహాలు
వరదపాలయిన హృదయం..
బద్దలవుతుందనుకునేలోపల ఏశక్తో
లాగి నన్ను బయటపడేస్తోంది
అంతమవుదామనుకునేలోపల ఏ ఆశో
మళ్ళీ నన్ను బతికిస్తోంది
ఆ ఆశకు పేరేంటో
నాకైతే ఏమీ తెలియదు

0 comments:

Post a Comment