మినీ కవితలు


( 1)
గుండె మొండిది
గుబులు ఉంచేసుకుంటుంది గుట్టుగా
మనసు మూగది
వేదన దాచేసుకుంటుంది తెలివిగా
కనులు బేలవి
బాధ బయటపెట్టేస్తాయి తడితడిగా


    (2)


నా గుండె 
ఇంకా కొట్టుకుంటూనే ఉంది
నువ్వక్కడే ఉన్నావనడానికి సాక్ష్యంగా


    (3)
తెలుసు ప్రేమ గెలిచినవాడికి
శిఖరం ఎత్తెంతో
ఓడినవాడికి
అగాధం లోతెంతో


    (4)
రెక్కలసాయంతో
విహంగయానం
ఆశల ఆసరాతో
మనిషి జీవనయానం


    (5)
పట్టుచీరకని అలిగె
గొప్పింటి గుమ్మ
పట్టెడన్నం కోసం నలిగె
గుడిసింటి అమ్మ


    (6)
చల్లనైన చందమామ
చల్లేది వెన్నెలే
పుట్టేవి మాత్రం
విరహాగ్ని జ్వాలలు


    (7)
భాషరాని మనసు
మూగదయ్యింది
చొరవకనుల సాయం
సాధ్యమయ్యింది


    (8)
మనిషి ఏకాకే
పశుపక్ష్యాదుల చెట్టుచేమల
సాహచర్యం లేకుంటే


    (9)
అనుభవాల నదుల్లోంచి
పొంగుకొస్తున్న సన్నని వాగు
ఉండుండీ ఉరికొచ్చే
జ్ఙాపకం!
అనుభూతుల పొదల్లోంచి
పొంచిచూస్తున్న పున్నమినాగు
అదనుచూసి కాటేసే
పచ్చినిజం!


    (10)
ఊరంతా గాలించినా
దొరకలేదు పువ్వులు
దర్శనమిచ్చాడు స్వామి
బోసినవ్వుతో
ఇంట్లోనే దొరికాయి
పసిపాపల నవ్వుల పువ్వులు
అర్చన జరిగింది వాటితోనే !







గుడిదేముడి కష్టాలు

గుళ్లో దేముడికెన్ని కష్టాలో..

ఒకరికంటె ఒకరు ముందంటూ
తోసుకుంటు తొక్కుకుంటు దూసుకెళ్లే
కిక్కిరిసిన భక్తజనసందోహంలో
కుక్కబడి, నొక్కబడి, నలపబడి
సమర్పించబడిన దుర్గంధపు పూమాలల
భారంతో ఊపిరాడక..

ఒకరికంటె ఒకరు ఎక్కువంటూ
వందలు వేలంటు వెలిగించి పేర్చిన
జ్యోతుల కాంతుల వేడి సెగలలో
హారతుల మంటల నల్లని పొగల
ధూపంతో చూపుకానక..

క్షణమైన గడువీయక టపటపమంటూ
సాగే తొక్కిసలాటల చిత్తడి చర్యలో
కొబ్బరి పగుళ్ల మోతలలో
మరుగునపడిన భక్తి సంకీర్తనల
మాధుర్యం చెవిన పడక...

ఆ స్వామి పడే పాట్లు ఎన్నని!

కానీ..ఆ స్వామి ప్రశాంతంగా ఉన్నాడొక చోట
నిర్మలమైన మనస్సుమాలతో అలంకరించబడుతూ
నిశ్చలమైన బుధ్ది జ్యోతితో దర్శించబడుతూ
నిశ్శబ్దమైన హృదయ గానంతో కీర్తించబడుతూ

నిజమైన భక్తుని గుండె గుడిలో!