గుడిదేముడి కష్టాలు

గుళ్లో దేముడికెన్ని కష్టాలో..

ఒకరికంటె ఒకరు ముందంటూ
తోసుకుంటు తొక్కుకుంటు దూసుకెళ్లే
కిక్కిరిసిన భక్తజనసందోహంలో
కుక్కబడి, నొక్కబడి, నలపబడి
సమర్పించబడిన దుర్గంధపు పూమాలల
భారంతో ఊపిరాడక..

ఒకరికంటె ఒకరు ఎక్కువంటూ
వందలు వేలంటు వెలిగించి పేర్చిన
జ్యోతుల కాంతుల వేడి సెగలలో
హారతుల మంటల నల్లని పొగల
ధూపంతో చూపుకానక..

క్షణమైన గడువీయక టపటపమంటూ
సాగే తొక్కిసలాటల చిత్తడి చర్యలో
కొబ్బరి పగుళ్ల మోతలలో
మరుగునపడిన భక్తి సంకీర్తనల
మాధుర్యం చెవిన పడక...

ఆ స్వామి పడే పాట్లు ఎన్నని!

కానీ..ఆ స్వామి ప్రశాంతంగా ఉన్నాడొక చోట
నిర్మలమైన మనస్సుమాలతో అలంకరించబడుతూ
నిశ్చలమైన బుధ్ది జ్యోతితో దర్శించబడుతూ
నిశ్శబ్దమైన హృదయ గానంతో కీర్తించబడుతూ

నిజమైన భక్తుని గుండె గుడిలో!

నానోలు

మనసు
మనిషంత
వయసు
వసంతమంత


గోరుముద్దంత
అమ్మ
గోదారంత
ప్రే


మతాలెన్నైతే
నాకెందుకు
మనుషులేగా
అన్నింటా!


ప్రేమ
సంద్రమంతైతే
గుండె
వరదవదా?


కష్టసుఖాలు
ఒక్కచోటే
గులాబి,
ముళ్లులా


విద్య
ప్రేమ
పంచేద్దాం
పెరుగుతాయి


కలయిక
మధురం
ఎడబాటు
దుర్భరం


ఆడబిడ్డ
అడ్డమా?
వడ్లగింజ
ఆయుధమా?


ఉప్పెన
దుఃఖం
ఆనకట్ట
ఓదార్పు














ఎవరు
నువ్వు?
అదే
ఆలోచిస్తున్నా!