ఉగాది పేరంటం


 ఇది ధరణి ఇంట పేరంటం
ఉగాది పండగ పేరంటం


తూరుపు దిక్కున తెలతెల వారగ
పచ్చని పచ్చిక కళ్లాపి జల్లగ
తెల్లని మల్లెలు ముగ్గులు వేయగ
వెల్లి విరిసెను..ధరణి వాకిలి


రవి కిరణాలే పసుపు అద్దగ
సూర్యబింబమే కుంకుమ దిద్దగ
మావితోటలే తోరణాలుగా
ముస్తాబయ్యెను..ధరణి ముంగిలి


వసంత ఋతువే బయలుదేరగా
శుకములు పికములు కవితలు చెప్పగ
కోకిల కమ్మగ పాటలు పాడగ
సెలయేటిగలగల వాయిద్యాలుగ
జాతర అయ్యెను..ధరణి లోగిలి


వనదేవతలే పేరంటాళ్లుగ
కొత్తపంటల తాంబూలమివ్వగ
పచ్చని ప్రకృతి సారధ్యములో
ఉగాది లక్ష్మికి హారతులివ్వగ
వేడుక ముగిసెను ముచ్చటగా

0 comments:

Post a Comment