అమ్మ అన్న మాట కమ్మనైనదన్నారే
అమ్మ అని నోరారా పిలిచే భాగ్యం,
మరి నాకు లేకుండా చేశావేమమ్మా?
పువ్వు కన్న సున్నితం ఆడదాని మనసన్నారే!
మొగ్గ లోనే చిదిమివేసి నేలరాసేసే,
కాఠిన్యత మరి నీకు ఎలా నచ్చిందమ్మా?
మాతృత్వం స్త్రీకి ఒక వరం అన్నారే!
నీ కర్కశత్వపు రక్కసికి నను బలిచేసి
నన్ను చంపి నువ్వెలా బతికున్నావమ్మా!
నీ పొత్తిళ్లలో ఒదిగి నీ కౌగిలిలో కరిగి
నీ చనుపాలతో సేదదీరి జీవించాలనుకున్నా
మరి నాకు జీవితమే లేకుండా చేశావేమమ్మా?
చల్లగా మెత్తగా స్వర్గంలో ఉన్నాననుకున్నా!
అంతలోనే సలసలకాగే నరకంలా మార్చి నన్ను
విఛ్ఛిన్నం చేసే అగ్నినెందుకు పంపించావమ్మా?
నీవు కలిగించిన విస్ఫోటంలో
ఏం జరిగిందో తెలుసా?
అప్పుడే రెక్కలు విప్పుకుంటున్న నా
చేతులు తున్నాతునకలై పోయాయి!
అపుడప్పుడే ఊహ తెలుస్తున్న నా
తల వేయి చెక్కలైపోయింది!!
ఎందుకిలా చేశావమ్మా!
నా అమ్మ కాని అమ్మా!
0 comments:
Post a Comment