శ్రీఖర కు స్వాగతం


వచ్చేశావా శ్రీఖరా! మళ్లీ అరవయ్యేళ్లకి
విచ్చేశావా శ్రీఖరా!


పోయినసారొచ్చినప్పుడు నువ్వు
చిగురించిన వసంతంలా 
ప్రకృతి శోభకు పరవశమొందుతు
పచ్చని చక్కని పరువంలా కనిపించావు


కానీ..ఇప్పుడేమిటిలా
పత్రహరిత రహిత ప్రపంచంలా
కాలుష్యపు సెగల వేడికి కాలుతూ
కమిలిన రగిలిన కాయంలా కనిపిస్తున్నావు?


మునుపొచ్చినప్పుడు నువ్వు
అరుదెంచిన ఆమనిలా
కోయిల పాటకు వంతపాడుతూ
కమ్మని తీయని గాత్రంలా అనిపించావు


కానీ..ఇప్పుడేమిటిలా
రణగొణ ధ్వనుల రణరంగంలా
కర్ణకఠోర శబ్ద ధాటికి చింతిస్తూ
నిస్తేజ నిర్జీవ గేయంలా అనిపిస్తున్నావు?


ముందొచ్చినప్పుడు నువ్వు
ఉదయించిన భానుడిలా
ఊహల రెక్కల కిరణాలొసగుతు
ఉరుకుతు దూకుతు ఉల్లాసంగా అరుదెంచావు


కానీ ఇప్పుడేమిటిలా
కృత్రిమ చేతల కల్మష లోకంలా
యాంత్రిక జీవన వలయాన తిరుగుతు
నిక్కుతు నీల్గుతు నీరసంగ అగుపిస్తున్నావు?


లాభం లేదు..నువ్వీదుస్థితిలోనే ఉంటే
సౌఖ్యం లేదు..నీ ఈ పరిస్థితి ఇలాగే ఉంటే
అందుకే..
నీ కోసం మేమంతా ఒక్కటై శ్రమిస్తాం!
హరిత  భరిత పపంచాన్ని సాధిస్తాం!
శ్రావ్య ధ్వనుల సామ్రాజ్యాన్ని సృష్టిస్తాం!
నిష్కల్మష నవీన లోకం నిర్మిస్తాం!!
                             

2 comments:

G K S Raja

హరిత  భరిత పపంచాన్ని సాధిస్తాం!
It's very good! Keep it up.
gksraja.blogspot.com

జ్యోతిర్మయి ప్రభాకర్

ధన్యవాదాలండి జి ఎస్ కే రాజా గారు..

Post a Comment