ఆమె-సార్ధకత



















పెళ్లిచూపుల్లో అందరిముందూ
నీ సమ్మతి తెలిపాక, వెళుతూ వెళుతూ
'ఇక మన మనసులు రెండు కావు ఒకటే' అనేలా
తన మెరిసే కళ్లలూఅకి నువు మురిపెంగా చూసినపుడు
...ఆమె మురిసిపోయింది


మంగళ వాద్యాల మధ్య
ఆమె మెడలో మూడు ముళ్లు వేశాక
మనసా వాచా కర్మణా
'ఇక మన జీవితాలు రెండు కావు ఒకటే' అనేలా
తన సంశయ నయనాల్లోకి నువు నమ్మకంగా చూసినపుడు
...ఆమె తృప్తిపడింది


ముత్తైదువుల కిలకిలనవ్వుల మధ్య
నీ గదిలోకి నెట్టివేయబడ్డాక
ఆమె చుబుకం పైకెత్తి
'ఇక మన తనువులు రెండు కావు ఒకటే' అనేలా
నువు ఆమె అరమోడ్పు కళ్లల్లోకి ఆర్తిగా చూసినపుడు
...ఆమె సిగ్గుమొగ్గయింది


నీ స్పర్శ తగిలిఇన చోటల్లా
సుమ సౌరభాలు పూయగా
ఆ కమ్మని గుభాలింపులో తన్మయురాలై
'ఇక ఈ జన్మ నాది కాదు నీది' అని
నీలో విలీనమయినపుడు
..ఆమె ధన్యురాలయింది


నీ కలలు తాను కని
నీ వ్యధలు తనవనుకుని
నీలో సగమై నీకనుగుణమై
నీ జీవానికి ప్రాణం పోసి
'ఇక మన ఆశలు రెండు కావు ఒకటే' అని
నిన్ను సమర్ధుడిని చేసినపుడు
...ఆమె సార్ధకురాలయింది







            

0 comments:

Post a Comment