పసిపాప మరణవాఞ్మూలం
ఇదిగో ఇక్కడెవరైనా ఉన్నారా?
నేనెవరని అడుగుతున్నారా?
నాకు ఊరూలేదు పేరూలేదు
పట్టుమని పదిగంటల వయసూ లేదు
ఇప్పుడే నన్నిక్కడెవరో పారేసి పోయారు..
గుడ్డల్ల్లేని నా వంటిని
గుచ్చుతున్నాయి రాళ్ళూ ముళ్ళూ
ఊపిరాడనివ్వడం లేదు నా కొనఊపిరిని
పొదలే చూస్తున్నా చుట్టూ
ఇంకెంతసేపో నిలవదు నా ప్రాణం
రాసుకోండి ఇస్తున్నా మరణ వాఞ్మూలం
"ఆమె కష్టపడి కన్నది మమకారంతో కాదు
అండంగానో పిండంగానో వదిలించుకొనే దారి దొరకక..
ఇక్కడివరకూ తెచ్చింది మానవత్వంతో కాదు
పక్కనెక్కడా నా ఏడుపు వినపడనియ్యని చోటు కనపడక.."
ఓరి దేముడా! శ్వాస ఆగేవరకూ నాకు నోరివ్వు
ఇస్తే అడుగుతా ఈ రాక్షస సమాజాన్ని
విశృంఖలతను వెంబడించి పోయి ప్రేమపాశం
గుడ్డిదైపోతున్నదా?
కర్కశత్త్వపు బండెక్కి ఊరేగి వాత్సల్యం
గడ్డకట్టిపోతున్నదా?
స్వార్ధరక్కసి మంటల్లోపడి అమ్మతనం
ఆవిరయ్యిపోతున్నదా?