ఫ్రీ రిజర్వేషన్


ఆ బండిలో
అందరికీ బెర్తులు ఫ్రీనే
ముందే..మీరడక్కుండానే
రిజర్వు అయిపోతాయి
ఎవరికివారు చేసుకోనక్కరలేని
రిజర్వేషను ఇదొక్కటే
అప్పుడప్పుడు తత్కాల్ ఆఫర్
కూడా వుంటుంది
బెర్తులు బానే ఉంటాయండోయ్
ఎంచక్కా పూలుచల్లబడి
అత్తరు పూయబడి
అగరొత్తుల పరిమళమద్దబడి
ఆ మాత్రం సోకు ఉండొద్దూ
బండిపేరు
మరణం మరి!

అందని తీరం



తీరంలో నిలబడి నీవు
కనపడుతూనే ఉన్నావు
పయనం నీవైపే అయినా
ఎందుకో..
ఈదినకొద్దీ
పెరుగుతోంది
దూరం !
ఈదిఈది అలసిన మనసు
ఆలోచనలో పడింది
కారణమేమయి ఉంటుందని
స్థిమితపడి చూస్తే
తెలిసొచ్చింది
అత్యాశదని
లోపం! 

కవి

 

నీ
హృదయం మెత్తని పూవుల పరుపు 
ఊహలు వెచ్చని ఉదయపు వెలుగు 
నువు సున్నితమై, సృజనవై 
ఒక స్పందనవై, స్ఫూర్తివై 
నీలో కోటిభావాలు పల్లవించగా 
అనంతమైన ఆలోచనల 
జలధివై భావోజ్వలితవై 
భాసిల్లు 
ఉషోదయానివి ! 

నీ
కవితాకౌశలపు ధారలతో
తడారిన రససీమలను
తడుముతూ తడుపుతూ
దాహం చల్లారుస్తూ
హృదయం చెమ్మెక్కిస్తూ
నిరంతర ప్రావాహమై
కదలిపోవు
కావ్యఝరివి !

నీ
చూపు సాంఘిక సమస్యలవైపు
ఆలోచన బాధిత అన్నార్తుల కొరకు
నువు కసివై క్రోధానివై
ఒక ప్రయోజనమై పరిష్కారమై 
నీ మహామేధస్సు విస్తృతించగా 
కదంతొక్కు కవనతేజమై
ఉరకలేయు 
ఉద్యమానివి !

....కవివి !
!

నిరీక్షణ


ప్రియా!
ఇక్కడే ఉన్నా
నువ్వొదిలినచోటే
లోతెరుగని అగాధపు అడుగున
అంటిపెట్టుకునే కూర్చున్నా
కనీకనిపించని సూర్యుని వెలుగులో
నీ కదలిక నీడలు కనపడునేమోనని
వినీవినిపించని గాలిసవ్వడి తోడై
నీ అడుగుల అలికిడి వినపడునేమోనని
ఒడలంతా కనులై
మనసంతా నీవై  
ఎదురుతెన్నులే ఊపిరై 
వేచియున్నా.. చకోరినై.. 
ప్రేమకై..
నీకై !

నానోలు


స్త్రీశక్తి
మహావృక్షం
కట్టిపడేస్తే
బోన్సాయ్ -
  
కాలుష్యం
వైరస్
సుస్తీలో
భూగోళం-


భాష
కాదు
ఆలోచన
కవిత్త్వం-


అన్నదాత
పేరన్నా
గంజినీరు
కరువన్నా-
నోట్లేస్తే


ఓట్లపంట
సాగుచేస్తే
అవినీతిపంట-


ఎండమావి
జీవనయానం
చూస్తూనే
సాగించాలి-
  
ఎదుటనే
అన్నీ
ఎంచుకో
హంసలా-


గడిచినవి
అనుభవాలు
మరువనివి
జ్ఞాపకాలు-


ఆశయం
ఆకాశమంత
సాధన
సాగరమంత-


చదవడానికే
జీవితపుటలు
రాయలేము
చెరపలేము-


విశ్వాసం
బలం
పరిశ్రమ
ఫలం-


కలవకముందు
నువ్వెవరో
కలిసినాక
నేనెవరో-


చూపుకి
చెరువంత
దక్కేది
దోసెడంతే-

గోరుముద్దంత
అమ్మ
గోదారంత
ప్రేమ-
  
ప్రేమ
సంద్రమంతైతే
గుండె
వరదవదా?-


విద్య
ప్రేమ
పంచేద్దాం
పెరుగుతాయి-


ఆడబిడ్డ
అడ్డమా
వడ్లగింజ
ఆయుధమా?-


ఉప్పెన
దుఖం
ఆనకట్ట
ఓదార్పు-


ఎవరు
నువ్వు
అదే
ఆలోచిస్తున్నా-


నువ్వు
నేనే
తక్కిందంతా
శూన్యం-


మోహం
ఎంత?
మౌనం
ఆగనంత-


నిర్లక్ష్యం
విత్తనాలు
అవినీతి
మహావృక్షాలు-


చీడపురుగు
చెట్టుకీ
అవినీతిపరుడు
దేశానికీ-



శిఖరం
అగాధం
ప్రేమ
చిరునామాలు-



జీవితకాలం
వెదుకులాట
ఫలితం
నేను- 



నాకోసం
వెతికాను
నువ్వు
దొరికావు-



రోజు
ఒకపాఠం
జీవితకాలం
కోర్సు-



ఆమె
మహాకావ్యం
ఆఖరిపేజీ
అడ్రసేలేదు-


6
మాట
ఒక్కపలుకే
మౌనం
లెక్కలేనన్ని-


6
దుఖం
ఓపికపట్టొద్దూ
ఉల్లిపాయ
కోసేంతవరకూ-


7
నీరు
పల్లమెరుగు
నానో
నాణ్యమెరుగు-


8
ఏకాంతమూ
సుఖమే
మదినిండా
నీవుండగా-



ఆవేశం
ఆలోచన
పగలు
రేయి -



సూక్ష్మం
సునిశితం
సుభాషితం
నానో-



కామం
గదివరకు
ప్రేమ
తుదివరకు-
  
చిగురంత
దానం
తరువంత
ప్రయోజనం-


ఊహల ఊయల


మరులు రేపు హృదయడోలలు పెదవిదాట ఆగిపోవగ
హాయిగొలుపు గిలిగింతలు పైకి తెలుపక ఆగిపోవగ
ఈ మౌనమెంత బాగుందో!

ప్రేమపలుకుల తేనెరాగాలు క్షణమైనను మరువక తలపించగ
వలపుతలపుల సుస్వరనాదాలు ఒకటైనను వదలక వినిపించగ
ఈ నిశ్శబ్దమెంత బాగుందో!

ఊహలల్లిన ప్రణయసీమల ప్రతిక్షణమూ నాదవ్వగ
గుండెగుడిలో పదిలమైనీవు అనుక్షణమూ తోడుండగ 
ఈ ఏకాంతమెంత బాగుందో!

వృధా తపస్సు


కట్టుబాట్లు పాషాణాలై
నలిగిచచ్చిన ప్రేమ
మిగిలించింది 
శిలాజపు జ్ఞాపకం 
వెదికి పట్టుకున్నావు సరే,
ఏం చేసుకుంటావు?
పగిలిన గుండెకు
సాక్షిగా ఎండిన రక్తపు చారికలూ
ఇంకిన కండ్లకు 
తోడుగా చూపుకందని కోరికలూ
మోడువారిన వృక్షానివి
పచ్చని భ్రమల కొమ్మలు వేళ్లాడేసుకు
ఎంతసేపు నిలబడతావు?

కొయ్యగుఱ్రపు స్వారీ

 

దేశాభ్యుదయం ఆశిస్తున్నారా?
సభలూ సదస్సులూ
ప్రసంగాలూ ప్రబోధాలూ
ఎన్నిచేసి ఏంలాభం?
కొయ్యగుఱ్రపు స్వారీ!
ఇంచైనా కదలని ఆశయం
ఎక్కండి అసలైన అశ్వాన్ని
దూసుకెళ్లండి సమస్యల వనంలోకి
వెతికిపట్టండి పరిష్కార ఫలాల్ని 

భారతదేవికి వందనం




భారతదేవీ వందనం ఓ..
బంగరు భూమీ వందనం
ఏడు స్వరములు పాటగ మారగా
కోటి స్వరముల కీర్తనం        /భారత/


నీ శుభగానం పాడెదమూ
నిరతము నిన్నే కొలిచెదమూ
ప్రతి ఒక ఫౌరునీ మానసమందిరం
నిండెను మంగళమౌ నీ రూపం    /భారత/


కాలం వెనుకే పరుగెడుతూ
సతతము మాకై శ్రమపడుతూ
అలసిన సొలసిన నిను సేవించే
అమ్మా మాకొక వరమివ్వు         /భారత/

కలతల కాలం ముగిసింది
కమ్మని తరుణం ముందుంది
ప్రతి భారతీయుడూ కార్మిక యోధుడై
నిలుపును జగతిలో నీ ప్రగతి  /భారత/