భవ్యమైన అనుభవాల బంగారు బాల్యమది
కమ్మనైన అనుభూతుల కమనీయ కాలమది
అమ్మ చేతిలో అన్నం గిన్నె
ఆమె వడిలో ఆకలితో నేను
ఎన్ని కబుర్లో ఎన్ని ముచ్చట్లో
ఎన్ని ముద్దలో ఎన్ని రుచులో
ఎన్ని ముద్దులొ ఎన్ని గారాలో
ఎన్ని కోర్కెలో ఎన్ని వరాలో
ఆ గోరుముద్దలు నాకుకావాలి మళ్లీ!
ఆ బంగారు బాల్యం లోకి వెళ్లాలి మళ్లీ!!
సాయం వేళ సందడి వేళ
బుజ్జి బుజ్జి పాపల పండగ వేళ
వీధి రోడ్డులో అక్కా అన్నయ్యలూ
వారి మధ్యలో ఆశగా నేను
ఆ లక్కపిడతలూ బొమ్మలాటలూ
ఆ చెమ్మచెక్కలూ దొంగాటలూ
ఆ బుల్లిగొడవలూ ఫిరియాదులూఆ బుంగమూతులూ బుజ్జగింపులూ
ఆ ఆటల స్వర్గం లో విహరించాలి మళ్లీ!
ఆ బంగారు బాల్యం లోకి వెళ్లాలి మళ్లీ!!
నీలాకాశపు పందిరి కింద
నక్షత్రాల పూదోట వెలుగులో
వాలుకుర్చీలో నాన్నగారు
ఆయన వడిలో హాయిగా నేను
ఎన్ని ఊహలో ఎన్ని ఊసులో
ఎన్ని ప్రశ్నలో ఎన్ని సమాధానాలో
ఎన్ని వింతలో ఎన్ని విశేషాలూ
ఎన్ని సంశయాలో ఎన్ని అనునయాలో
ఆ బ్రహ్మ పాఠాలు నాకు కావాలి మళ్లీ!
ఆ బంగారు బాల్యం లోకి వెళ్లాలి మళ్లీ!!
2 comments:
chaaala baundi paaatagaa ayithee inkaaa baaavuntundi
ధన్యవాదములు వసీరా గారు..పాడి కూడా చూద్దాం
Post a Comment