కల-జీవితం

ఎడ తెరిపి లేని ప్రయాణం..
ఆసాంతం వీక్షిస్తూ..విహరిస్తూ..
ఒక్క క్శణం నిరాశ..

అగాధాల అంచున పయనిస్తూ
ఎక్కడో చీకటి పాతాళంలోకి పడిపోతూ
మళ్లీ లేచి పైపైకి ఎగురుతూ
పడుతూ.. లేస్తూ..
మరుక్షణం ఏదో ఆశ..

ప్రపంచమంతా వర్ణమయంగా
మెరుస్తూ.. గుభాళిస్తూ..
ఆనందడోలికల ఊరేగుతూ
ఎన్నెన్నో అనుభూతుల తేలియాడుతూ

అంతలోనే..ఆగిపోయింది
నిశీధి నిద్ర ముగిసిపోయింది
కల్లల కల మాయమయ్యింది
కల చెదిరి ఉదయమయ్యింది
జీవితం ముగిసి మరణమొచ్చింది

ఇదీ పరిస్థితి !

దొరగారు....
తాగి తాగీ తాగలేక వదిలేసి వంపేసిన
తిని తినీ తినలేక కక్కేసి జల్లేసిన
ఒకరోజు తిండి విలువ ఎంతో తెలుసా?
తాగ గంజి లేక పేగులంటుకుపోయిన
వెయ్యిమంది అన్నార్తుల డొక్కలు తడపగలిగినంత!

దొరమ్మగారు...
ఒకట్రెండ్రోజులకే మొహం మొత్తేసి వదిలేసిన
ముట్టకుండా వాడకుండా చెత్తబుట్ట పాల్జేసిన
సౌందర్య సాధనాల ఖరీదెంతో తెలుసా?
పగలూ రేయీ ఇంటా బయటా చాకిరీ చేసినా
బిడ్డలకు పట్టెడన్నం పెట్టలేని దరిద్రాన్ని మోస్తున్న
వందమంది మాతృమూర్తుల శోకాన్ని చల్లార్చగలిగినంత!

చిన్న దొరగారు...
వినకపోయినా మోగే స్టీరియో
చూడకపోయినా వాగే వీడియో
కరెంటు ఖర్చు నెలకెంతో తెలుసా?
కాఫీ కప్పులు కడిగే కుళ్లు నీళ్లల్లో కొట్టుకుపోయే
కాలిబూట్లు తుడిచే దుమ్ము ధూళిలో ఎగిరిపోయే
పదిమంది నిరుపేద బాలమేధస్సుల ఆశ తీర్చగలిగినంత!

'నాకు నచ్చిన వ్యక్తులు' లో నా రెండవ చిత్రం