అబ్బురాలు-అద్భుతాలు


 అబ్బురాలు-అద్భుతాలు

మౌనంగా పెరిగే మొక్కా
ముచ్చటగా వికసించే పువ్వూ
వెలుగుతూ ఎగిరే మిణుగురూ
గుంభనంగా గూడు కట్టే పక్షీ
మట్టిముద్ద దొర్లించుకెళ్లే పురుగూ
పలికే చిలకా పాడే కోయిలా
పండే చేనూ పండ్లిచ్చే చెట్టూ
అనునిత్యం గోచరించు అబ్బురాలు


విశాల వినీల ఆకాశం
గంభీరాకార మహాసాగరం
ఠంచనుగా వచ్చెళ్లిపోయే సూర్యచంద్రులూ
నిధులెన్నో దాచుకున్న నేలా
లేకుంటే ఏంటన్నది ఊహించలేని నిప్పూ నీరూ ఉప్పూ 
అన్నాదులను పండిచి ఇచ్చే మట్టీ
ప్రవహించే నీరూ పడిలేచే కెరటం
కదిలే మేఘం కురిసే వర్షం
అగుపిస్తూ అంతుచిక్కని అద్భుతాలు    

తెర


తెర

తెర లేచింది
సినిమా మొదలయ్యింది

ప్రేమ అనుబంధం
పంచుకోడాలూ పెంచుకోడాలూ
ఆహ్లాదభరితం
కొంతసేపు...


స్నేహం బంధుత్త్వం
కలవడాలూ కనుమరుగవడాలూ
సహజాతిసహజం 
మరికొంతసేపు..


అనుభవం అవగతం
పశ్చాత్తాపాలూ ప్రాయశ్చిత్తాలూ
అంతర్మధనం
ఇంకాస్తసేపు...


వేదంతం వైరాగ్యం
ఉపదేశాలూ ఉపశమనాలూ
ఆత్మావలోకనం
మిగిలున్నంతసేపు ...


సినిమా అయిపోయింది 
తెరపడింది!!

సహజానందం


సహజానందం

ఇంట్లో అంతా సినిమాకెళ్లారు
ఎప్పుడో తారలాడిన ఆటను
తెరమీద బొమ్మలుగా చూడ్డానికి.
ఇంట్లో ఎందుకని తోటలోకి మార్చా వాలుకుర్చీని.
 

పువ్వుపువ్వునీ ముచ్చటగా పలకరిస్తూ
రెక్కలను పొందిగ్గా కదిలిస్తూ 
నాట్యం చేసె సీతాకోకచిలకలూ

ఆ చెట్టుకు ఈ చెట్టుకు వంతెన వేస్తూ  
ఘుమ్మని రాగాలు తీస్తూ
ఆక్కడొక కాలూ ఇక్కడొక కాలూ  
వేస్తూ తిరిగే గండుతుమ్మెదలూ

అపుడపుడూ నిర్భయంగా పరిగెత్తుకొచ్చి వాలి
ఏదోటి ముక్కున దక్కించుకున్నాక
భయంగా తుర్రున పారిపోయే జంటపిట్టలూ

నాకు చూపించాయి ఓ అద్భుతమైన సినిమా
ఆహ్లాదకరమైన, సహజమైన సినిమా !