గుడిదేముడి కష్టాలు

గుళ్లో దేముడికెన్ని కష్టాలో..

ఒకరికంటె ఒకరు ముందంటూ
తోసుకుంటు తొక్కుకుంటు దూసుకెళ్లే
కిక్కిరిసిన భక్తజనసందోహంలో
కుక్కబడి, నొక్కబడి, నలపబడి
సమర్పించబడిన దుర్గంధపు పూమాలల
భారంతో ఊపిరాడక..

ఒకరికంటె ఒకరు ఎక్కువంటూ
వందలు వేలంటు వెలిగించి పేర్చిన
జ్యోతుల కాంతుల వేడి సెగలలో
హారతుల మంటల నల్లని పొగల
ధూపంతో చూపుకానక..

క్షణమైన గడువీయక టపటపమంటూ
సాగే తొక్కిసలాటల చిత్తడి చర్యలో
కొబ్బరి పగుళ్ల మోతలలో
మరుగునపడిన భక్తి సంకీర్తనల
మాధుర్యం చెవిన పడక...

ఆ స్వామి పడే పాట్లు ఎన్నని!

కానీ..ఆ స్వామి ప్రశాంతంగా ఉన్నాడొక చోట
నిర్మలమైన మనస్సుమాలతో అలంకరించబడుతూ
నిశ్చలమైన బుధ్ది జ్యోతితో దర్శించబడుతూ
నిశ్శబ్దమైన హృదయ గానంతో కీర్తించబడుతూ

నిజమైన భక్తుని గుండె గుడిలో!

నానోలు

మనసు
మనిషంత
వయసు
వసంతమంత


గోరుముద్దంత
అమ్మ
గోదారంత
ప్రే


మతాలెన్నైతే
నాకెందుకు
మనుషులేగా
అన్నింటా!


ప్రేమ
సంద్రమంతైతే
గుండె
వరదవదా?


కష్టసుఖాలు
ఒక్కచోటే
గులాబి,
ముళ్లులా


విద్య
ప్రేమ
పంచేద్దాం
పెరుగుతాయి


కలయిక
మధురం
ఎడబాటు
దుర్భరం


ఆడబిడ్డ
అడ్డమా?
వడ్లగింజ
ఆయుధమా?


ఉప్పెన
దుఃఖం
ఆనకట్ట
ఓదార్పు














ఎవరు
నువ్వు?
అదే
ఆలోచిస్తున్నా!

అద్భుత నిధి

( మినీ కవిత)


మానవ మస్తిష్కం
మహా సముద్రం
మంచిముత్యాలూ
మణి మాణిక్యాలూ
వెతికి ఏరి
పోగుచేసుకోవడమే
మనిషి పని !


బుల్లి మేధావులు

తెలివంటే నాదే కదా!
అని మురిసిపోతుంటా గానీ
'అది నీ సొత్తేం కాదు' అని
నాకు గుర్తుచేసినట్లుంది వీటి
తెలివికి బలయినప్పుడల్లా..

ఏం చెప్పను చీమెంతటిదో!
ఏదైనా ఇలా పెట్టి అలా వెళ్లొచ్చే లోపల
కంటికైన కనపడనిచోటికెక్కడికో
మోసుకెళ్లి గుట్టుగా దాచేసుకుంటోంది

దోమెంత తెలివైందని!
లైటార్పి గుడ్ నైట్ అనే లోపల
జుయ్యిమని ఎగిరొచ్చి చటుక్కున
గిచ్చేసి గమ్మత్తుగ మాయమయిపోతోంది

నల్లిమాత్రం తక్కువ తిందా!
ఏమూల నుంటుందో ఇలా కూర్చోగానే
గబగబ బయిటికొచ్చి చిటుక్కున
కుట్టేసి చల్లగా దాక్కుండిపోతోంది

పేను సంగతి చెప్పాలా!
లేనట్టే ఉంటుందిగానీ ఉండుండి ఒకసారి
జరజర పాకొచ్చి కసిక్కున
కొరికేసి గమ్ముగ ఊరకుండిపోతోంది

ఇలా రోజూ..
చిన్నవేకదా అనుకుంటూనే
చీటికీ మాటికీ వీటిచే
మోసగించబడుతున్నాను
నా తెలివి తెల్లారినట్ట్లే ఇక!

ఆదర్శం

నేను నువ్వు కాగలనా?
నీలా నేనెప్పటికైనా మారగలనా?

కిలకిల మని నవ్వేస్తూ ఉంటావు
కరడుగట్టే దుఃఖాన్నైనా
కనులచాటున దాచేస్తూ..

పులకరముగ పలుకరిస్తుంటావు
ఎదను కాల్చే వ్యధలనైనా
హృదయగోడల కదిమేస్తూ..

గలగలమని మాట్లాడేస్తుంటావు
గుండెలవిసే బాధనైనా
గుటకలేసి మింగేస్తూ..

అలా నేను అవగలనా?
నీలా నేనెప్పటికైనా మారగలనా?

స్వేచ్ఛాపయనం

ఎగిరే గాలిపటం
నీ జీవనపయనం
గాలి ఎటు వీస్తే
అటు సాగుతోంది
ఏ గాలీ లేనప్పుడు చతికిలబడుతోంది
తాకిడెక్కువైనప్పుడు విలవిల్లాడుతోంది
ఇంతేనా నీ జీవితం?
ఎవరో ఎగరేసే గాలిపటంలా కాక
నీక్కావలసిన దిశను నువ్వే నిర్దారించుకోలేవా?
నువు చేరాల్సిన గమ్యాన్ని నేవే నిశ్చయించుకోలేవా?
నీకనువైన గమనాన్ని నీవే నిర్దేశించుకోలేవా?
ఇప్పటికైనా మేలుకో
దిశలేని గతిలేని పయనాన్ని మార్చుకో
ఓ స్వేచ్ఛావిహంగంలా విహరించడం నేర్చుకో