Buscar

Páginas

 

నీకు తెలీకుండా నీలో
________________

నీకే కాదు
మీఅమ్మక్కూడా తెలీకుండా
నీతోపాటే నేనూవచ్చేసా
ఈభూమ్మీదికి

నీవయసు వేగంకన్నా
నాదురుసుతనపు వేగమే ఎక్కువ
అందుకే
ఎప్పుడూ
నీకన్నా నేనే ముందు

నీలో కలిసిపోయి
పప్పులో ఉప్పులా
ఉండాల్సినంత కాక, ఎక్కువయినప్పుడల్లా
నువు భంగపడుతున్నా
నీకంటికి చిక్కలేదు చూసావా?

నీలో నేనున్నానని తెలీని
నీపతనాలకన్నిటికీ
కారణం నేనేనని తెలీని
నీ అమాయకత్వానికి జాలేసి
నన్నొదిలేసుకుంటావని
నీకెన్నో అవకాశాలిచ్చా

అప్పుడు తెలిసింది..
ఎన్నవమానాలైనా భరిస్తావు గానీ
నన్నొదులుకోలేవని
అప్పట్నించే నీపై ఏవగింపు
అయినా నిన్నొదిలి పోలేను
అప్పటికే నా అంతట నేను వెళ్ళలేనంతగా
నన్ను నీలో బంధించేసుకున్నావు

నువు కాశీ ప్రయాణమయినపుడనుకున్నా
కచ్చితంగా నన్నక్కడొదిలేస్తావని
ఊహూ..తెలివిగా
నీకు నచ్చని కాకరకాయా
ఎప్పుడూ తినని వెలగపండూ
వదిలేసావ్

పోన్లే ఈనాటికైనా దొరికింది నాకు విముక్తి
ఇక నీదారి నీదీ నాదారి నాదీ
అదుగో నీకు సాయం వస్తున్నారు యమభటులు
వెళ్ళు
నాపేరు 'అహం' అని తెలీని ఇంకో మనిషిని
నేనూ చూసుకోవాలిగా !!
 

దినదినగండం
___________

మరీ మరీ సెప్పెల్లింది
ఎనకాల సెక్కతలుపు సారేసి
గొల్లెం సరీగా ఎట్టమని
గొల్లెం ఎడితే మాత్రం ఏటి
సెక్కే ఇరిగిపోయున్నాది
అదో లెక్కేటి ఆ ఎదవ కుక్కకి?
నాన్నకని దాసింది ఎండుసేప్ముక్క
మద్దేనం ఎంతాకలేసిందో
మూత్తీసి ఓపాలి వాసన సూసాను గానీ
తినీసినా బాగున్ను!

రాత్రి గెంజికాయడానికి
పుల్లల్తెచ్చెట్టమంది
ఈ ఎదవ ఒక నిమసమేనా వదిల్తేనా?
సంకదించితే సాలు
ఊరంతా ఇనపడేలా గోల గోల
నాన్నకి టీజేసిచ్చినాక మిగిల్న
అరగ్లాసు పాలు ఎప్పుడో పొద్దున్నే
అవజేసీసేడు
మద్దేనం నీల్లల్లో మైదాపిండి కలిపి
సీసా నోట్లో ఎడితే
నాయేపదోలా సూసాడు గానీ
అన్నీ తాగీసేడు

సీకటడిపోతుంది
ఆలిద్దరూ వొచ్చేస్తారింక
ఇయాల్టికి..
పుల్లల్తేలేదనీ సేప్ముక్క కుక్కకెట్టీసాననీ
ఇంతపిసరు జాగర్తలేదేమే ఎదవముండా అని
మొట్టికాయలెట్టకుండా అమ్మ
నన్నొదిలేస్తే బాగున్ను
నాన్న తాక్కుండా వొస్తే బాగున్ను
నంచుకోడాని నీసు లేకుండా సేసేవేమే అని
తన్నకుండా నాన్న
అమ్మనొదిలేస్తే బాగున్ను!