నాన్నెప్పుడూ నాతోడే
































లోకంలోని నాన్నలంతా ఒకెత్తు
నాకు మా నాన్నొక్కరే ఒకెత్తు 

ఈ అక్షరాలు నాకాయనిచ్చినవి
నా లక్షణాలు ఆయన్నించొచ్చినవి
సుతిమెత్తిని హృదయమాతని సొంతం
చీమకైనా ఎలాంటి హానీ చేయలేరు

మృదువైన భాషణ అతనికాభరణ
పొరపాటునైన పరుషములాడెరుగరు

సూక్ష్మమైన జ్ఙానమాతని సొత్తు
విషయమేదైనా విడమర్చి చెప్పగలరు

మంచులాంటి మనసాతని ఆస్తి
కలనైనా కష్టమెవరికి కలగనీరు

నా ఉత్సాహానికి ప్రోత్సాహమై
నా ప్రతిభలకు పునాదై
నా ప్రతిపనికీ ప్రేరణయై
నా అశయాలకు ఆలంబనై
అన్నిటా తోడై నడిపించారు

కనిపించని లోకాలనున్నా
నాక్కనిపిస్తూనే ఉన్నారు
నా ఆలోచనలలో నిండి.
ఆచరణలలో నాతోడుండి
అప్పుడూ..ఇప్పుడూ..ఎప్పుడూ

నాతోడే మా నాన్నెప్పుడూ !

పుత్రోత్సాహం?



చూడవే మనబాబు ఎంత ముద్దొస్తున్నాడో
ఒకటే ఆనందం పసికందుని చూస్తూ
వీడెంత స్పష్టంగా మాట్లాడుతున్నాడో చూసావూ?
అత్తా..తాతా..తొలిపలుకులే వేదాల్లా వినపడినప్పుడు

అరె, నా దిష్టే తగిలేలా ఉందే
తోటిపిల్లల్తో పోలిస్తే మావాడే అందంగా ఉన్నాడు
మా వాడికి బ్రహ్మాండమైన రాంకు వచ్చింది
తొణికిసలాడే గర్వంతో ఆఫీసులో స్వీట్లు పంచిపెడుతూ


ఎంత ఠీవి, ఏమి దర్జా, మగవాడంటే ఇతడే కదా!
పట్టలేని సంతోషం అతన్ని ఉద్యోగస్తుడిగా చూస్తూ
మనవాడు పెళ్లికొడుకుగా ఎంత బాగున్నాడో కదూ!
ఇంత ముచ్చటగా మునుపెవర్నైనా చూసామా?

నా కన్నతండ్రి ఇద్దరు పిల్లలకు తండ్రయాడా?
ఎంత హుందాగా ఉన్నాడు నాన్న హోదాలో!
ఇంత అందమైన ఇల్లు ఈ దరిదాపుల్లో ఉందా?
మనవాడు కాబట్టి ఇంత గొప్పగా కట్టించగలిగాడు

ఒకటేమిటి? అడుగడుగునా ఆనందమే
ప్రతిరోజూ వాణ్ణి చూసి నాకు సంబరమే
మొన్నటివరకూ!

ఇప్పుడు మురిసిపోవడానికి ఇక్కడ ఏమీ లేదు
నాతో కలిసి నెమరేసుకోడానికి ఆమె కూడా లేదు
ఈ ఆశ్రమంలో నా చుట్టూ నాలాంటి నాన్నలే
వాళ్ల కొడుకులూ మావాడిలాగే
అమెరికాలోనో..ఆస్ట్రేలియాలోనో..

మంట


చింపిరి జుట్టూ చీమిడి ముక్కూ
చినిగిన గుడ్డా చిక్కిన పొట్టా
ఇదే అవతారం..ఊహ తెలిసినప్పట్నించీ
ఇవేవీ బాధించవు వాడిని.. 


కళ్లల్లో నీరసం కడుపులో నకనకా 
చేతిలో కొరడా ఛాతిపై చురచురా
ఇదే వ్యవహారం..కాస్త నడకొచ్చినప్పట్నించీ
అదేమీ మంటనిపించదు వాడికి..


మిట్టమద్యాహ్నం..
కాలికి బూటున్నా, నెత్తికి టోపీఉన్నా
ఉస్సురుస్సురని ఆపసోపాలుపడే
జనప్రవాహం..


అప్పుడప్పుడూ చిరాగ్గా చూసే చూపూ
అడపాదడపా పరాగ్గా విసిరే కాసూ
ఉండుండి కోపంగా అదిలించే పోలీసూ
పక్కనే గుక్కపెట్టి ఏడ్చే తమ్ముడూ
ఇవేమీ అసలు పట్టవు వాడికి..


ఎంత కొట్టుకుంటే అంత జాలి
చర్మమెంత కందితే అంత సొమ్ము


కడుపులోని ఆకలి మంట కంటే  
వంటిపైని కొరడా దెబ్బల కంటే  
ఎక్కువ మంట పుట్టేది వాడి గుండెలో! 
తను ఖాళీ బొచ్చెతో ఇంటికెళితే
నాన్నకాలితో తన్నులు తినే అమ్మ
దీనమైన చూపుల్ని చూసినపుడు!   

అన్నీ జ్ఙాపకమే

అన్నీ జ్ఙాపకమే...ప్రియా!

నా నడకల కదలికల చిరు సవ్వడులు
నీ చెవిని సన్నగా చేరినప్పుడు
ఎక్కడనీవెక్కడని నాకై నీ కన్నులు పరికించడం..

నా హృదయ స్పందనల తరంగ వీచికలు
నీ మదిని మెత్తగా తాకినప్పుడు
గుండెచప్పుడాపి పరిపరి నీ మనసు పరితపించడం..

నా తొలితొలి వలపుల తొలకరి జల్లులు
నీ మోవిపై చల్లగా కురిసినప్పుడు
సమ్మోహితమై తడిసిన నీ పెదవులు కంపించడం..

నా మల్లియ సొగసుల పరిమళ గంధాలు
నీ ఎడదపై మృదువుగా పూసినప్పుడు
పరవశభరితమై తన్మయ నీ తనువు పులకించడం..

అన్నీ..నాకింకా జ్ఙాపకమే
!

తిరిగిరాని ప్రయాణం


కాలం సాగిపోతోంది
కాదు కాదు పరిగెడుతోంది
రైలు బండి స్పీడులో దూసుకెళుతోంది
ఎక్కడికి ప్రయాణం? ఏమో!
గమ్యం తెలీని ప్రయాణం

వెనక్కి వెళ్తున్నవేమీ మళ్లీ రావా?
అలక్ష్యంతో అందుకోని ఆత్మీయులు
వెనక్కి వెళ్లిపోయిన దృశ్యాల్లా
నిర్లక్ష్యంతో వదిలేసిన బంధాలు
మళ్లీ తిరిగిరాని స్టేషన్లలా..
అనిపిస్తున్నాయి ఇప్పుడు

గమ్యం చేరాక తిరిగి ఇంకోసారి
ఈ బండి వెనక్కి వెళితే బాగుణ్ణు
ఈసారి శ్రధ్ధగా.. బుధ్ధిగా..
జాగ్రత్తగా..జాగరూకతగా
ఇష్టంగా..అర్ధవంతంగా..
వళ్లు దగ్గరపెట్టుకుని కళ్లింత చేసుకుని
ప్రయాణం మళ్లీ మొదలెడతా
!